ప్రజాప్రతినిధులు చట్టసభలలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న “64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్” లో జరిగిన “నేటి రోజులలో చట్టసభల నిర్వాహణలో శాస్త్ర సాంకేతిక అంశాల ప్రభావం” అంశంపై ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
సామాన్య ప్రజలు అన్ని రంగాలతో పాటుగా చట్టసభలలో కూడా ఖచ్చితత్వం, సమర్ధత, నైపుణ్యం, పారదర్శకత కోరుకుంటున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:మారుతున్న కాలానుగుణంగా నేటి ఆధునిక యుగంలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు కూడా ఆధునిక శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. సామాన్య ప్రజలు తమ వినతులను చట్టసభల ప్రతినిధులకు చేరవేయడానికి ఇ-మేయిల్ సాంకేతికంగా ఉపయోగపడుతుంది. పార్లమెంట్ కమిటీలు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ప్రయాణ సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోగలుగుతాయి.
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ లలో ఓటింగ్ ను జరపడం ద్వారా సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఖచ్చితత్వం మరింత మెరుగవుతుంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినా కూడా తెలంగాణ రాష్ట్రం శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందుంది. శాసనసభ, మండలి సభ్యులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. సభ్యులకు ఐ ఫోన్, ల్యాప్ టాప్ లను అందజేయడం జరిగింది.
సభ కార్యక్రమాలను సభ్యులకు ఇ-మేయిల్స్, ఫోన్ మెసేజ్ ల ద్వారా ఎప్పటికప్పుడు వేగవంతంగా అందివ్వడం జరుగుతుంది. ప్రజలకు అవగహన కోసం శాసనసభ నిర్వాహణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. శాసనసభలోని ప్రశ్నలు, సమాధానాలు వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది