తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలులో తలెత్తుతున్న సమస్యలపై మరోసారి దృష్టిసారించనున్నారు. మొత్తం 8 కీలక అంశాలు అజెండాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఏపీ భవన్ విభజన, ఆప్మేల్ తగాదాలాంటి క్లిష్టమైన అంశాలపై కూడా విపులంగా మాట్లాడుకోనున్నారు. ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో విభజన సమస్యలపై తెలంగాణా, ఏపీ అధికారులు భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించే ఈ సమావేశం ఆగస్ట్ 8 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన పలు సున్నిత సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. మొత్తం 8 అంశాలతో కూడిన అజెండా ప్రతిని జోడిస్తూ, సమావేశానికి హాజరు కావాల్సిందిగా పది రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది.
ఏపి భవన్ విభజన పీటముడి వీడేనా
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం, రాష్ట్ర విడిపోయిన ఆరేళ్ళ తరవాత కూడా ఓ కొలిక్కిరాలేదు. 8 వ తేదీనాటి మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ప్రధాన అంశంగా చర్చకు రానుంది. ఏపీ భవన్ పంపకం కోసం 2018 లో ఆంధ్రప్రదేశ్ రెండు ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఆ రెండింటి పట్ల తెలంగాణా ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ నిజాం వారసత్వ సంపదగా సంక్రమించింది అనీ, అది మొత్తం తమకే చెందాలనేది తెలంగాణా రాష్ట్ర వాదన. అవసరమైతే ఏపీకి కొంత మొత్తం పరిహారం చెల్లిస్తామని కూడా అంటోంది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గతంలో కేంద్ర హోంమంత్రికి లేఖలు కూడా రాశారు. ఇక IX వ షెడ్యూల్లోని 91 సంస్థల వివాదం ఇంకా అపరిష్కృతంగానే ఉంది. ఈ సంస్థల హెడ్ క్వార్టర్ నిర్వచనం వివాదంపై రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదు.
షీలా బిడే కమిటీ సిఫార్సులపై తెలంగాణ నో
ఈ సంస్థల వివాదాల పరిష్కారం కోసం షీలాభిడే కమిటీ చేసిన సిఫారసులపై తెలంగాణా ప్రభుత్వం పెద్ద సంతృప్తిగా లేదు. కానీ, ఏపీ మాత్రం షీలాభిడే కమిటీ సిఫారసులకనుగుణంగా 40 సంస్థల ఆస్తులు, అప్పుల విభజన కోసం జీవోలు జారీ చేసింది. ఈ దిశలో తెలంగాణా కూడా స్పందించాలని ఏపీ కోరుతోంది. ఇందుకు సంబంధించి అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తెలంగాణాను కోరింది. ఐతే షీలాభిడే కమిటీ మార్గదర్శకాలు కేవలం ఓ 50 సంస్థల సమస్య పరిష్కారానికి మాత్రమే ఉపకరిస్తాయని మన అధికారులు అంటున్నారు. అందుకు అనుగుణంగా జారీ చేయాల్సిన జీవోల్లో కేవలం 3 సంస్థలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 47 సంస్థల ఉత్తర్వుల జారీ ప్రక్రియ ఇంకా పెండింగ్ లోనే ఉంది.