ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యతుల్లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతేనే వారిలో నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత నిర్మూలించి శారీరక, మానసిక అభివృద్ధికి అందరూ తోడ్పాటునందించాలి.
ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 10, ఆగస్టు 10న రెండుసార్లు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు వారికి అల్బెండజోల్ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రలు వేయనున్నారు. దీని కోసం నేడు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు, రోహిత్ నాయక్ పాల్గొన్నారు.