28.6 C
Hyderabad
September 20, 2020 13: 55 PM
Slider ముఖ్యంశాలు

కరోనాతో పోరాడేందుకు ఆయుర్వేదం బెస్ట్

#Venkaiahnaidu

అపారమైన జ్ఞానానికి ప్రతీకైన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే గాక, భారతీయుల జీవన విధానమని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఇంతటి విస్తృత జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరముందని ఆయన సూచించారు.

‘వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం’ ఇతివృత్తంతో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సును మంగళవారం అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతోనే అద్భుతమైన వైరస్‌తో పోరాడే శక్తిని ఆయుర్వేదం అందిస్తుందని తెలిపారు.

ఆయుర్వేదంలో మరన్ని ప్రయోగాలు జరపాలి

భారతీయ జీవన విధానానికి ప్రతిబింబమైన ఆయుర్వేదాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఆధునిక వైద్య వ్యవస్థకు, ఆయుర్వేదం వంటి సంప్రదాయ పద్ధతులను జోడించి విశ్వమానవాళి శ్రేయస్సుకై మరిన్ని ప్రయోగాలు జరపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

‘ఆయుర్వేదం మానవుడిని కూడా ప్రకృతిలో ఓ అభిన్న అంగంగానే భావిస్తుందని, అందుకే మానవుడికి వచ్చే సమస్యలకు తన చుట్టూ ఉన్న ప్రకృతిసిద్ధమైన మందులతోనే తగ్గిస్తుందని, అదే ఆయుర్వేదం ప్రత్యేకత అని ఆయన తెలిపారు.

కఫ, వాత, పిత్త (త్రిదోష) దోషాలను, ప్రకృతిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మానవ శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటుందని పేర్కొన్నారు.

అథర్వణ వేదం, చరకసంహిత, సుశ్రుత సంహిత మొదలైన పురాతన వైద్య గ్రంథాలను ప్రస్తావిస్తూ ప్రాచీనకాలంలో భారతదేశం క్రమపద్ధతిలో, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన పద్ధతిలో వివిధ వ్యాధులకు చికిత్సనందించిన విషయాన్ని కూడా ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మరింత పరిశోధన జరిగితే మానవాళికి మంచిది

అప్పటినుంచి ప్రాథమిక, అత్యవసర వైద్యసేవలు అందించడంలోనూ ఆయుర్వేదం పాత్ర మరువలేనిదన్నారు. ఆయుర్వేద ప్రాశస్త్యం ఇలాగే కొనసాగేందుకు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కొత్త ఔషధాలకోసం ప్రయోగాలు జరిపేలా అధునాత ఆర్&డీ సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టడం తక్షణావసరమని సూచించారు.

ఇప్పటికే భారతదేశం నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఔషధాలను ప్రపంచానికి అందిస్తోందని తెలిపారు. దీనితోపాటుగా దేశాన్ని సంపూర్ణ ఆరోగ్యానికి కేంద్రంగా మార్చడంతోపాటు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

లిఖిత పూర్వక శాస్త్రీయ ఆధారాల ద్వారా ఆయుర్వేద ఔషధాల లక్షణాలను మరింత అన్వేషించాల్సిన అవసరాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి ఆయుర్వేద ప్రయోజనాలను మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఆయుర్వేద వైద్యంలోని భాగస్వామ్య వర్గాలు.. నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ వంటి సంస్థలో కలిసి పనిచేయడం ద్వారా సంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా కృషిచేయాలన్నారు. హెల్త్ స్టార్టప్‌లను ప్రోత్సహించడంపైనా దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వి.మురళీధరన్, సీఐఐ చైర్మన్ థామస్ జాన్ ముత్తూట్, సీఐఐ ఆయుర్వేద ప్యానల్ కో-కన్వీనర్ బేబీ మాథ్యూ, ఆయుర్వేద అసోసియేషన్ సభ్యులు, ఆయుర్వేద డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి

Satyam NEWS

దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

Satyam NEWS

మద్యం దొరికింది..తాగాడు..భార్యను కొట్టాడు..చనిపోయాడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!