35.2 C
Hyderabad
April 24, 2024 14: 48 PM
Slider ప్రత్యేకం

బీ ఇండియన్: కరోనా కొట్టేద్దాం ‘ఆయుష్’ పెంచుకుందాం

ayush

కరోనా నుండి పౌరులను రక్షించుకోడానికి ఒక్కొక్క దేశం ఒక్కొక్క పద్ధతి కనుక్కొనే పనిలో బిజీ అయిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో పాటు, తమ దేశ వైద్య పరిశోధనా సంస్థల సలహాలను పాటిస్తూ దేశాలు ముందుకు వెళ్తున్నాయి.

కొత్త వ్యాక్సిన్ ను రూపొందించే పనులలోనూ వేగంగా కదులుతున్నాయి. పరిశోధనాలూ చేపట్టాయి. భౌతిక దూరం పాటించడం, శుచి, శుభ్రతలు, ఐసోలేషన్ కేంద్రాలు, పరీక్షల తంతు మొదలైన వాటిల్లో  అన్ని దేశాలు ఒకే తీరులో వెళ్తున్నాయి.

వీటితో పాటు సంప్రదాయ లేదా దేశీయ మార్గాలవైపు కూడా ఎక్కువ దేశాలు మొగ్గు చూపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా  ఆయుర్వేద విధానంపై ప్రముఖంగా మాట్లాడుతున్నారు. మొన్న సూచించిన సప్తపదిలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఒక ప్రధాన సూత్రం.

దానికి యోగ సాధనను ఒక ప్రధాన మార్గంగా ఎంచుకోమని అంటున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఈ దిశగా సూచనలను ప్రజల ముందు ఉంచింది. ఇవన్నీ కూడా కాల పరీక్షలో గెలిచిన,  ఆయుర్వేదం జాతికి అందించిన అద్భుత మార్గాలు.

ఈ మార్గాలన్నీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో శక్తి వంతంగా పనిచేస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు. రోగాలను ఎదుర్కోడంలో సహజ శారీరక పటుత్వం పెంచుకోవడమే మన ముందున్న కర్తవ్యం. కరోనా బారిన పడిన వారికి చికిత్స సాగుతోంది.

ఇప్పటివరకూ మన దేశంలో కరోనా కేసులు 13,000 మాత్రమే.135కోట్ల జనాభాను రక్షించుకోవడంలో ఆయుష్  విధానం ఎంతో కొంత ఉపయోగపడుతుందనే విశ్వసించాలి. ఆయుష్ చూపిస్తున్న మార్గాలు ఆచరణాత్మకంగానే ఉన్నాయి.

ఆనందంగా ఆరోగ్యం గా ఉండాడానికి దినచర్య ప్రధానమైంది. దీనినే ఆధునికులు ” లైఫ్ స్టైల్ ” అంటున్నారు. ఆయుర్వేద విధానంలో దినచర్య, ఋతు చర్య అని రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రతిరోజూ పాటించేది, రెండవది మారుతున్న సీజన్ల బట్టి ఒక్కొక్క సీజన్ లో పాటించేది.

వీటికి ఔషధ మొక్కలే మూలాలు. మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు గమనించి, వాటిని వివిధ రూపాల్లోకి మార్చి వాడుకోవడం అనేది దీని ప్రధాన మార్గం. మనం ఇంట్లో స్వయంగా పాటించేవే ఇందులో ఉన్నాయి. రోజంతా గోరు వెచ్చని నీరు తాగడం.

ఒక అరగంట సేపు యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము  సాధన చెయ్యడం. ఆహారంలో చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వాడడం. పొద్దున్నే 10గ్రాముల చ్యవనప్రాస తీసుకోవడం. కషాయం లేదా టీ ఇంకా నిమ్మకాయ నీళ్లు త్రాగడం.

ఉదయం, సాయంత్రం  కొబ్బరినూనె లేదా ఆవు నెయ్యి ముక్కుల్లోకి ఎక్కించుకోవడం. ఆయిల్ పుల్లింగ్, పుదీనా ఆకులతో వేసి వేడి నీళ్లతో ముక్కుకు ఆవిరి పట్టించుకోవడం. లవంగం పౌడర్ ను తీసుకోవడం….మొదలైన మార్గాలు ఆయుష్  సూచిస్తోంది.

ఇవన్నీ  సులువైన మార్గాలే.  ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగ, నాచారోపతి ఇవన్నీ దేశీయ వైద్య విధానాలే. భారతదేశంలో ఆయుర్వేదం చాలా వరకూ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోనే ఉంది. సిద్ధ విధానం తమిళనాడు, తమిళీయులు ఎక్కువగా అనుసరిస్తున్నారు.

యునాని విధానం గ్రీసు నుండే పుట్టిందని చెప్పాలి. ఈ విధానం అనేక దేశాల్లోకి వ్యాప్తి చెందింది. అరబ్బులు దీన్ని బాగా అభివృద్ధి చేశారు. మధ్యయుగంలో భారతదేశానికి వచ్చింది. హోమియోపతి జర్మన్ శాస్త్రవేత్త సృష్టించినా, ఆధునికకాలంలో భారతదేశానికి వచ్చి, స్థిరపడింది.

జీవన మార్గమే యోగ. శారీరక మానసిక దృఢత్వానికి బలమైన మార్గం యోగ. మందులు వాడకుండా సహజమార్గాలలో రోగాలను పోగొట్టుకొనే మార్గమే నాచారోపతి. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగ,నాచారోపతి.. ఇవన్నీ కలిసిన దేశీయ వైద్య విధానమే  “ఆయుష్”.

ప్రాధమిక ఆరోగ్యం కోసం ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కొన్ని దేశాలలో 80 శాతం ప్రజలు దేశీయ/సంప్రదాయ వైద్య విధానాలనే పాటిస్తున్నారు. భారతదేశ శారీరక, సామాజిక, ఆర్ధిక పరిస్థితులకు దేశీయ వైద్య విధానాలు మంచి ఫలితాలే ఇస్తాయని ఆశించవచ్చు.

ఈ విధానాలన్నీ ఆర్ధికంగా తక్కువ ఖర్చుతోనే ముడిపడి ఉన్నాయి. ఒత్తిళ్లతో కూడిన ఆధునిక జీవితానికి ఈ మార్గాలు సంజీవినిగా పనిచేస్తాయని మనం భావించవచ్చు. ఔషధ మొక్కలు కాపాడుకోవడం, పెంచుకోవడం బాగా తగ్గిపోతోంది. మందులతో పండించే పంటలనే ఎక్కువగా  ఆహారంగా తీసుకుంటున్నాము.

ఆర్గానిక్ వ్యవసాయ విధానం చాలా తక్కువగా సాగుతోంది. ఆవులు, గేదెలు, మేకల పెంపకమూ తగ్గిపోతోంది. మనం తీసుకునే పాల ఉత్పత్తుల్లో వీటివాటా చాలావరకూ తగ్గిపోయింది. ఉద్యోగ, పనుల ప్రస్థానంలో నిద్ర, ఆహార సమయాలూ మారిపోయాయి.

చెట్లను నరుక్కొని,  చుట్టూ ఉండే  వాతావరణం కూడా పాడుచేసుకున్నాము.మందులతో 80 ఏళ్ళు జీవించి,గతం కంటే  ఆయుష్షు నిష్పత్తి పెరుగుతోందనుకోవడం ఎంతవరకు సబబో మనమే ఆలోచించుకోవాలి.ఏ మందులు వాడకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితకాలం పెంచుకుంటే, అది అసలైన ఆరోగ్యమవుతుంది.

దేశీయ వైద్య విధానాలపై ఇంకా అధ్యయనాలు, పరిశోధనలు పెరగాలి. సంప్రదాయ విధానాలను మన ఇంటి పెరటి చెట్టు కింద భావించక, దేశీయ వైద్యాన్ని శక్తి వంతంగా మలచుకుందాం. దేశీయ వైద్య విధానాలు దేశ ప్రజల ఆరోగ్య రక్షణకు కవచాలు కావాలని ఆకాంక్షిద్దాం.

మా శర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

ATM మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఇక ఓటీపీ

Satyam NEWS

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Satyam NEWS

మఠంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Satyam NEWS

Leave a Comment