రష్యన్ వైమానిక దళాల కాల్పుల వల్ల కజకిస్థాన్‌లో అజర్‌బైజాన్ విమానం కుప్పకూలిందా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఎంబ్రేయర్ 190 బుధవారం నాడు అజర్‌బైజాన్ రాజధాని బాకు నుండి ఉత్తర కాకసస్‌లోని రష్యన్ నగరమైన గ్రోజ్నీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అందులో ఉన్న 67 మందిలో 38 మంది మరణించారు.
అక్టౌకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరానికి సమీపంలో విమానం కూలిపోయింది. విమానం నేలను తాకడానికి ముందు నిటారుగా దిగి ఫైర్‌బాల్‌లో పేలినట్లు కనిపించింది. ప్రమాదం నుంచి బయటపడిన 29 మందిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అజర్‌బైజాన్ గురువారం దేశవ్యాప్తంగా సంతాప దినాన్ని పాటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలు అవనతం చేశారు. మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ బుధవారం ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ వాతావరణం కారణంగా విమానం మార్గం మార్చవలసి వచ్చిందని అన్నారు.
కజకిస్థాన్, అజర్‌బైజాన్, రష్యా అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎంబ్రేయర్ ఒక పత్రికా ప్రకటనలో కంపెనీ అందరు సంబంధిత వ్యక్తులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రష్యా పౌర విమానయాన అథారిటీ రోసావియాట్సియా చెప్పిన విషయం ప్రకారం చూస్తే విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటానికి పక్షులు కారణమని తెలుస్తున్నది. విమానం తోక విభాగంలో కనిపించిన రంధ్రాలు ఉక్రేనియన్ డ్రోన్ దాడిని నిరోధించే రష్యన్ వైమానిక రక్షణ వ్యవస్థల నుండి కాల్పులు జరిపి ఉండవచ్చని సూచిస్తున్నాయి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్, ఏవియేషన్ సెక్యూరిటీ సంస్థ, “అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని రష్యా సైనిక వైమానిక రక్షణ వ్యవస్థ కాల్చివేసి ఉండవచ్చు” అని చెప్పింది. యుద్ధ సమయంలో రష్యాలో డ్రోన్ దాడులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించి కంపెనీ 200కు పైగా హెచ్చరికలు జారీ చేసిందని ఓస్ప్రే సీఈవో ఆండ్రూ నికల్సన్ తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ ఆస్తుల ద్వారా విమానం కాల్చివేయబడిందనే వాదనల గురించి గురువారం అడిగిన ప్రశ్నకు, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులతో మాట్లాడుతూ పూర్తి వివరాలు వచ్చే వరకూ ఊహాగానాలు చేయడం కరెక్టు కాదని అన్నారు.