38.2 C
Hyderabad
April 25, 2024 11: 17 AM
Slider సంపాదకీయం

బాబాయి హత్య: ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలు ఎన్నో

#YS Vivekananda Reddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కుట్రదారులు ఎవరో క్రమంగా బయటపడున్నట్లుగా అనిపిస్తున్నది. హత్య ను చంద్రబాబునాయుడికి ఆపాదిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ ఎంతో లాభపడింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన చిక్కుముడులు వీడిపోతున్నట్లుగా కనిపిస్తున్నది. వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఇంకా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

అన్ని వాస్తవాలను ఈ హత్య కేసు విచారణ సందర్భంగా సీబీఐ వెల్లడించాల్సి వస్తుంది. అందుకోసం సీబీఐ అన్ని ఆధారాలను పకడ్బందిగా సేకరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రియమైన సోదరుడు, కడప ఎపి అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐ పిలిచి విచారణ చేయడంతో ఒక్క సారిగా వైసీపీలో ఆందోళన ప్రస్పుటంగా కనిపించింది. హత్య కు సంబంధించిన కుట్రదారులు బయటకు వస్తే ఇంత కాలం ఆ పార్టీ చేసిన ప్రచారాలకు అడ్డుకట్టపడుతుంది. గుండె పోటుతో వివేకానందరెడ్డి మరణించారు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేసినందున అతడిని కూడా విచారించాలనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది.

అదే విధంగా ఆ పార్టీకి చెందిన పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని వ్యాసాలు రాయించడం ఎవరి ప్రోద్బలంతో జరిగింది? రాసిన వారు ఎవరు? అనే విషయాలను కూడా సీబీఐ విచారించాలని వివిధ వర్గాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ పత్రిక రాసిన కథనంతో తెలుగుదేశం పార్టీపై పలు అనుమానాలు వచ్చాయి. తద్వారా వైసీపీ రాజకీయంగా లాభపడింది. ఇప్పుడు ఆ కథనాలలో నిగ్గు తేల్చడం కూడా సీబీఐకి అవసరం అవుతుంది. ఎందుకంటే వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయడం, ఆ హత్యకు సంబంధించిన ఆనవాలను తుడిచివేసే ప్రయత్నం చేయడం, గొడ్డలివేటు కనిపించకుండా శవానికి కుట్లు వేయడం, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, ఏ మాత్రం సంబంధంలేని వారికి హత్యను ఆపాదిస్తూ వార్తలు రాయించడం ఈ మొత్తం వ్యవహారాలను విశ్లేషించి అందుకు తగిన సాక్ష్యాధారాలను పకడ్బందిగా న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది.

ఈ అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటేనే హత్య ఎవరు ఎందుకు చేశారనే విషయాన్ని న్యాయస్థానంలో రుజువు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కడప ఎంపి అవినాష్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన కాల్ డేటాలో విస్తుపోయే నిజాలు వెల్లడి అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన కాల్ డేటాను పూర్తిగా విశ్లేషిస్తే కుట్ర కోణం మరింత విస్పష్టంగా వెల్లడి అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. సీబీఐ కూడా దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే విధంగా సీబీఐ ఎలాంటి వత్తిడులకు లోను కాకుండా ముందుకు వెళితే మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసుకు త్వరలోనే ముగింపు పలకవచ్చు.

‘హై ప్రొఫైల్ మర్డర్ కేసు’ అయిన వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ కూడా ఎవరి వత్తిడికి లోనుకాకుండా న్యాయస్థానంలో రుజువు అయ్యే విధంగా పకడ్బంది చర్యలు తీసుకోవాల్సిఉంటుంది. సీబీఐ వారు ఈ కేసును ఒక వేళ రుజువు చేయలేకపోతే అది తీవ్రమైన రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ వత్తిడి వల్లే ఇలా జరిగింది అనే అపప్రదను బీజేపీ మోయాల్సి వస్తుంది. అందుకోసం కేంద్రంలో ఉన్న బీజేపీ వారు సీబీఐ ఈ హత్యకేసులో చేస్తున్న దర్యాప్తుకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కల్పించరాదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ జాప్యం కావడానికి సీబీఐ పై బీజేపీ వత్తిడే కారణమనే వాదన బలంగా వినిపిస్తున్నది.

రాజకీయ కారణాలు చూడకుండా వ్యవహరించాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉంటుంది. సీబీఐని బీజేపీ ఎలా కట్టడి చేస్తుంది? అది ఒక స్వతంత్ర సంస్థ అని వాదించే వారు ఆ వాదనకే కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. ఇప్పటికైతే ఈ కేసు దర్యాప్తులో ఎన్ని అడ్డంకులు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఎదురు కేసులు పెట్టినా సీబీఐ కొంత మేరకు పురోగతి సాధించిందనే చెప్పాలి.

Related posts

ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి ఆదర్శం కావాలి

Satyam NEWS

మిట్ట మధ్యాహ్నం.. నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

ఆస్తి కోసం  క‌న్న‌వారు చేసిన కిరాత‌కం…!

Satyam NEWS

Leave a Comment