మంత్రి పొంగూరు నారాయణ తనపై వేసిన పరువునష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి 9కి వాయిదా వేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకురాగా నారాయణ తరఫున న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు.
కౌంటర్ వేసేందుకు మరింత సమయం ఇవ్వాలని, పిటిషనర్, సాక్షి పత్రికకు సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. తమ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని కోరారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణను జనవరి 9కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.