18.3 C
Hyderabad
November 30, 2022 02: 40 AM
Slider తెలంగాణ

స్వర్గం చేస్తామన్నారు నరకం చూపెడుతున్నారు

bad roads of hyderabad

గతంలో జరిగిన హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్  ఎన్నికల సమయంలో రాజకీయ  పార్టీలకు రోడ్లు కీలక  ప్రచార అస్త్రంతో పాటు ప్రధాన అంశంగా మారిపోతుంది. నేతలు అరచేతిలో  స్వర్గం  చూపెట్టారు. రోడ్లను అద్దంలా చేస్తామన్నారు. ఒక్క గుంత చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని సవాల్ చేశారు. ఫ్లయిఓవర్లన్నారు, అండర్ పాస్ లన్నారు. ట్రాఫిక్ సమస్య చిటికలో తీర్చేస్తామన్నారు. అయితే… ఎన్నికలు ముగిసిన  తర్వాత ఎక్కడ దొంగలక్కడే…గప్ చుప్ అన్నట్లు నాయకులంతా సర్దుకున్నారు.

జంట నగరాల ప్రజలు ఈ విషయంలోనూ బహుదొడ్డ మనసున్న మహానుభావులు .సహనశీలులు..ఎలాగైనా  సర్దుబాటు చేసుకుని జీవితాన్ని గతుకుల నుంచి నడిపించి సాఫీగా చేసుకున్న వాళ్లం..మాకిదో లెక్కా!అనుకుంటారు ..కాలం గడిపేస్తుంటారు. బంజారా హిల్స్ ,జుబ్లీహిల్స్ హైటెక్  సిటీ  లాంటి ప్రాంతాలతో పోలిస్తే  మిగిలిన ప్రాంతాలలో  రోడ్లు అధ్వాన్నం. అన్నిచోట్లా  పై పై మెరుగులే!హైదరాబాద్  రోడ్ల గురించి  చర్చ అవసరం లేనప్పటికీ కొన్ని సందర్భాలలో  తప్పడం లేదు. ఒకటి రెండు  ప్రాంతాలలో  రబ్బరు రోడ్లు వేసి విఫల ప్రయోగాలు కూడా  చేశారు . అవి లక్ష్యసాధనలో గురి తప్పాయి. ఇప్పుడేమో వర్షాకాలం దాటిన  తర్వాత  రోడ్లు  బాగవుతాయంటున్నారు కానీ కనుచూపు మేరకు అటువంటివేవీ ఊహామాత్రంగా కూడా అందడం లేదు.

నిజానికి నరకం  ఎక్కడుందో  తెలియాలంటే నగరం నడిబొడ్డున వున్న  కొన్ని  అధ్వాన్నమైన రోడ్లను  ఎంపిక  చేసుకుని చూస్తే చాలు. అన్నట్లు ఇలాంటి రోడ్లు చూడటానికి పెద్దగా ఎంపిక కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండోయ్. ఎక్కడ చూసినా అవే. వర్షాకాలానికి ముందు రోడ్ల పునరుద్ధరణ  కార్యక్రమాలు  చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం  కూడా ఇందుకు  గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది . పనులు పూర్తయి వర్షాలు  కాస్తోకూస్తో పడ్డాయి. కానీ ఈ రోడ్లు  మాత్రం గుత్తేదారుల బారిన పడి ప్రజలను  నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పలు ప్రాంతాలలో  కంకర  రాళ్లు  లేచిపోయి కలవరపెడుతుండగా మరికొన్ని  చోట్ల  ఇంకుడు గుంతల సైజులో  రోడ్ల మధ్యలో గోతులు పడ్డాయి .ప్రధాన రహదారులలొ  జనసమ్మర్ధం వున్న మాసాబ్ టాంక్ , ఫిల్మ్ నగర్,టోలీచౌక్,బంజారా హిల్స్  రోడ్  నెం.12, షేక్ పేట్  రోడ్,రాయదుర్గం… ఇలా ఒక్కటేమిటి కూకట్ పల్లి నుంచి ఎల్ బి నగర్ వరకూ, ఉప్పల్ నుంచి శంషాబాద్ వరకూ ఇదే తీరు. మళ్లీ మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయి చూద్దాం మళ్లీ ఇప్పుడు ఏం చెబుతారో.

-వ్యాకరణం రామసుబ్రహ్మణ్యం

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్

Satyam NEWS

మంత్రాల నెపంతో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!