36.2 C
Hyderabad
April 24, 2024 19: 26 PM
Slider సంపాదకీయం

జగనన్న జోరుకు బాలినేని బ్రేక్

#balinenisrinivasareddy

జగనన్నే మా నమ్మకం అంటూ జోరు పెంచాలని విశ్వప్రయత్నం చేస్తున్న వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, పార్టీలో ఆది నుంచి కీలక పాత్ర పోషించిన ఉమ్మడి ఒంగోలు జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పదవుల నుంచి వైదొలగడం చర్చనీయాంశం అయింది. తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ని సీఎం జగన్ ఒక్క సారిగా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి పదవి నుంచి తప్పించారు.

దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మనస్థాపం చెందారు. మంత్రి పదవి పోగానే పార్టీ నుంచి వైదొలగేందుకు ఆయన ప్రయత్నించగా వైసీపీ అధిష్టానం ఆయనను బతిమిలాడి ఉంచుకున్నది. ఆ తర్వాత ఆయనను చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన అకస్మాత్తుగా వైకాపా రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మాజీమంత్రి బాలినేని ప్రకటించారు. దాంతో ఒక్క సారిగా వైకాపా ఉలిక్కిపడింది.

బాలినేని చాలా కాలంగా పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు. ఆ మధ్య కాలంలో బాలినేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సన్నిహితులతో సమావేశమైనట్లు పుకార్లు వచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. ఆ తర్వాత మళ్లీ వైసీపీలోనే కొనసాగారు. అయితే తాజాగా ఆయన తన పదవులకు రాజీనామా చేయడంతో బాలినేని ఒక వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టం అయింది.

బాలినేని మంత్రి పదవి పోవడానికి తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలే కారణమని అప్పటిలో వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి పార్టీలో అంటీముట్టనట్లు ఉన్న బాలినేని అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలినేని ని మళ్లీ బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున ఎవరికి సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. బాలినేని కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా టచ్ లో ఉన్నట్లు అనధికార వర్గాల ద్వారా తెలిసింది. తెలుగుదేశం పార్టీ తనకు పార్లమెంటు సీటు, రెండు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే తాను గెలిపించుకుంటానని బాలినేని తెలుగుదేశం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది.

అయితే అందుకు తెలుగుదేశం నేతలు అంగీకరించలేదని, ఒక అసెంబ్లీ సీటు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ముందు వైసీపీ నుంచి బయటకు వస్తేనే తదుపరి చర్చలు ఉంటాయని కూడా తెలుగుదేశం నాయకులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దాంతో ముందుగా బాలినేని పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

(బాలినేనికి పొగ పెట్టిన వైసీపీ అగ్రనేత ఎవరు? సత్యం న్యూస్ లో అతి త్వరలో)

Related posts

నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించిన టీడీపీ

Satyam NEWS

రేవంతన్న పదవీ స్వీకారోత్సవానికి వేలాదిగా తరలిరండి

Satyam NEWS

అక్రమాలను వ్యతిరేకిస్తాం….అభివృద్ధిని స్వాగతిస్తాం

Satyam NEWS

Leave a Comment