28.7 C
Hyderabad
April 20, 2024 08: 01 AM
Slider సంపాదకీయం

ఆర్ధిక మాంద్యంతో పెరుగుతున్న ఆర్ధిక నేరాలు

bank-fraud

దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న కారణంగా ఆర్ధిక నేరాలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థల పనితీరును దెబ్బతీస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున పది లక్షల మందికి ఆర్థిక నేరాల రేటు 2014 లో 110 నుండి 2017 లో 111.3 కి పెరిగింది.

ఇందులో బ్యాంక్ మోసాలు, బ్యాంక్ రికార్డుల తారుమారు నుంచి కుంభకోణాల వరకూ ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం సమయంలో పెరుగుతున్న సంఘటనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా ఉంది.

ఎన్‌పిఎలుగా రూ .50 కోట్లకు పైగా ఉన్న అన్ని రుణాల మోసపూరిత వ్యవహారాన్ని పరిశీలించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కోరింది.  ఈ కేసులను గుర్తించడానికి కేంద్ర ఒక రిజిస్ట్రీ కూడా ఏర్పాటు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ .95,760 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు మోసాలు జరిగాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి ఇటీవల లోక్ సభలో చెప్పారు.

ఇలాంటి మోసాల కారణంగా పెద్ద బ్యాంకులు 2018-19 లో 64,509 కోట్లు నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రూ .25,417 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ రూ .10,822 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ .8,273 కోట్లు నష్టపోయాయి. పంజాబ్ & మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పిఎంసి) లో ఇటీవల జరిగిన బ్యాంకు మోసం ఫలితంగా తొమ్మిది మంది పెట్టుబడిదారులు ప్రాణాలు కోల్పోయారు. 

దశాబ్ద కాలంగా పెరిగిన ఇటువంటి బ్యాంక్ మోసాల కారణంగా ఆర్‌బిఐ తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నది. డిజిటల్ చెల్లింపులు ఎంత ఎక్కువగా జరుగుతుంటే అంత ఎక్కువ గోల్ మాల్ జరుగుతున్నట్లు కూడా ఒక పరిశీలన ఉంది. మోసగాళ్ళు వ్యవస్థలోని బలహీనతల ఆధారంగా దోపిడీ చేస్తారు.  ఈ పరిస్థితిలో జాగ్రత్త వహించాలని ఆర్థిక, సైబర్‌ సెక్యూరిటీ రంగంలోని నిపుణులు హెచ్చరించారు.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఆర్థిక నేరాలు ఎక్కువగా ఉంటాయి.  2017 లో అత్యధిక ఆర్థిక నేరాలు భారతదేశంలో, ముఖ్యంగా రాజధాని నగరం ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో అతి ఎక్కువగా నమోదయ్యాయి.  ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో ఆర్థిక నేరాలు పెరిగాయి.  ‘పింక్ సిటీ’ గా ప్రసిద్ది చెందిన జైపూర్, ముంబై, ఢిల్లీ కంటే ఎక్కువ ఆర్థిక నేరాలను నివేదించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 

ముంబై నగరంతో పోలిస్తే అక్కడ ఆరవ వంతు జనాభా మాత్రమే ఉంది. అయితే ఆభరణాలు, రత్నం, వస్త్రాలు, మైనింగ్, ఖనిజ, ఆటోమొబైల్స్, ఐటి పరిశ్రమలు పెరగడంతో అక్కడ ఆర్ధిక నేరాలు కూడా పెరిగాయి. ఈ విధంగా వ్యాపారం పెరిగితే ఆర్ధిక నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. వీటన్నింటికి ఆర్ధిక మాంద్యమే కారణమని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

Related posts

సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

Bhavani

లక్ష్యం 100 శాతం పూర్తి కావాలి

Murali Krishna

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ తో ఆందోళన వద్దు

Satyam NEWS

Leave a Comment