38.2 C
Hyderabad
April 25, 2024 13: 44 PM
Slider ప్రత్యేకం

బిజెపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ‘చెత్త’ చిచ్చు

#UnionBankOfIndia

జగనన్న తోడు పథకానికి రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసి  తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ఘటన వివరణతో లేదా సుతి మెత్తగా చెప్పడతో సరి పెట్టేంత చిన్నది కాదని.. చాలా తీవ్రమైనదని కేంద్రానికి కూడా వెంటనే తెలిసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు,  ఏపీలో తాము ఎదుర్కొంటున్న వేధింపుల వ్యవహారాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని నిర్ణయించింది.

రాజకీయంగా మారిన అంశం

ఏపిలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఈ చెత్త ఉదంతం ఇప్పుడు రాజకీయంగా కూడా మలుపులు తిరుగుతున్నది. జగనన్న తోడు పథకానికి రుణాలు మంజూరు చేయకపోవడంతో యూనియన్ బ్యాంక్ బ్రాంచిల ముందు మునిసిపాలిటీ వాహనాలతో చెత్త వేయించారు.

దాదాపుగా  20 బ్యాంకుల ముందు ఒకే సారి చెత్త వేశారు. చెత్త వేసిన తర్వాత ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ పేరుతో బోర్డులు కూడా పెట్టారు. అది యాదృచ్ఛికంగా, ఆవేశంతో చేసిన పని కూడా కాదు. అంటే ముందస్తుగా ప్రణాళిక ప్రకారం, ఇలా చేశారని స్పష్టమవుతుంది.

అయితే బ్యాంకులు లోన్లు ఇవ్వనందుకు లబ్దిదారులే ఆ పని చేశారనే వాదనను  అధికారులు వినిపించడం ప్రారంభించారు. రుణాలు మంజూరు చేయడం లేదంటూ బ్యాంకుల ముందు చెత్త పోయడాన్ని బ్యాంకర్లు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

నిరసన వ్యక్తం చేసేందుకు బ్యాంకర్లు సిద్ధం

సోమవారం ఏదో ఒక రూపంలో తమ నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) స్పందించింది.  ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతోందా’ అంటూ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యూరులో ఏపీ మున్సిపల్‌శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఈ చెత్త ఉదంతంపై విచారణ ప్రారంభించారు. ఎవరి ఆదేశాలతో చెత్త వేశారన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్, మెప్మా, చెత్తను సేకరించే ఏజెన్సీని ప్రశ్నించారు.

అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే ఏమౌతుందో తెలుసు. రుణాలు రాని ఖాతాదారులు ఎవరో ఇలా చేశారని తేలుస్తారనడంలో కూడా సందేహం లేదు. పథకం ప్రకారం కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పని చేశారని అందరికి తెలుసు.

అయితే ఆ విషయాన్ని విచారణాధికారులు తేల్చరు గాక తేల్చరు. ఎందుకంటే గతంలో ఇంత కన్నా సీరియస్ విషయాలు జరిగితేనే ఏమీ కాలేదు. బ్యాంకు మేనేజర్లను బెదిరించి తామే చెత్త పోయించుకున్నామని స్టేట్ మెంట్ ఇప్పించినా ఇప్పిస్తారు.

ఆ బ్యాంకు మేనేజర్లు ఆ ఊళ్లో తిరగాలంటే అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేయక తప్పని పరిస్థితి.

కృష్ణా జిల్లాలో ఒకే రోజున విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులలో ఒకే రోజు బ్యాంకు శాఖల ముందు చెత్తపోయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ‘ఉన్నతస్థాయి’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేశారని పేరు చెప్పడానికి భయపడుతున్న బ్యాంకర్లు అంటున్నారు.

అసంబద్ధమైన నిబంధనలు పెడితే రుణాలు ఎలా ఇవ్వాలి?

ఉయ్యూరులో ‘నగరపంచాయతీ కమిషనర్‌’ పేరిట బ్యానర్లు ఉంచడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, పీఎం స్వనిధి తదితర పథకాల విధివిధానాల్లో స్పష్టత లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగానే రుణాలివ్వడంలో జాప్యం జరుగుతోందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వక అలసత్వం లేదని వివిధ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటాన్ని బ్యాంకర్లు భయపడుతూనే ఖండిస్తున్నారు.

ఈ ఘటనను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా సపోర్టు చేస్తున్నది. రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశం బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేరుగా తలపడుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో రెండో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బిజెపి దేవాలయాలు కూలగొట్టడం నుంచి బ్యాంకుల ముందు చెత్త పోయడం వరకూ ఏ అంశాన్నీ వదలడం లేదు.

బిజెపి ఏ ఆందోళన చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తున్నది తప్ప నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపడటం లేదు.

ఎం.ఎస్.సుధాకర్, సీనియర్ రిపోర్టర్, సత్యంన్యూస్.నెట్

Related posts

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

శాల్యూట్: కరోనాకు పవన్ కళ్యాణ్ సాయం రూ.2 కోట్లు

Satyam NEWS

కెమెరా రోల్: నాగ్, చిరంజీవితో మంత్రి సమావేశం

Satyam NEWS

Leave a Comment