ప్రపంచంలోనే సుసంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి తాలిబాన్లు షాక్ ఇచ్చారు. అఫ్గానిస్తాన్‌లో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార సమయంలో వచ్చే యాడ్స్, మైదానంలో ఆడవాళ్ల నృత్యాలు వంటివి ముస్లిం మత విధానాలకు విరుద్దమని.. వాటిని చూడటం వల్ల మనసులో చెడు భావాలు వస్తాయని టీవీ, మొబైల్స్‌లో ఐపీఎల్ ప్రసారాలు బ్యాన్ చేసినట్లు తెలిపారు.
అఫ్గానిస్తాన్‌లో క్రికెట్‌ను అభివృద్ది చేసింది తాలిబన్లే అయినా.. మొదటి నుంచి మహిళలను మాత్రం స్టేడియంలలోకి అనుమతించడంపై నిషేధం ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అఫ్గానిస్తాన్‌లో అన్ని రకాల వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. క్రీడా ప్రసారాలతో పాటు మహిళల ఆటలు ఆడటంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. రెండో దశ ఐపీఎల్ లో అఫ్గానిస్తాన్‌కు చెందిన క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్ ఆడుతున్నారు.
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఆ స్టేడియంలోకి జుట్టు కత్తరించుకున్న మహిళలు మ్యాచ్ చూడటానికి వస్తారని.. వాళ్లు టీవీలో కనిపించే అవకాశం ఉంటుందని తాలిబన్లు అంటున్నారు. వాళ్లను చూడటం వల్ల అఫ్గాన్ మహిళలు కూడా వారిని అనుసరిస్తారని, అందుకే టీవీ, మొబైల్‌లో ప్రసారాలు నిషేధిస్తున్నామని తెలిపారు.
తాలిబన్ల నిర్ణయంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనుంది. అఫ్గానిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలకు ‘ఆర్టీఏ టీవీ’ హక్కులు కలిగి ఉంది. ఇప్పుడు తాలిబన్లు నిషేధం విధించడంతో భారీగా నష్టం రానుంది. అయితే కచ్చితంగా ఎంత నష్టం వస్తుందని వెల్లడించకపోయినా.. అఫ్గానిస్తాన్ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడినట్లు సమాచారం.