ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుండి బీసీలను మినహాయించాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బిసి కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణనను అత్యంత పగడ్బందీగా చేపట్టి ఆ లెక్కలను వెల్లడించి,స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్, సభ్యుల ఆధ్వర్యంలో బీసీల స్థితిగతులపై నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమానికి హాజరై బీసీ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషన్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలలో కూడా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, సహకార బ్యాంకు ఎన్నికలలో ఇప్పటివరకు రిజర్వేషన్లు లేవని రాబోయే ఎన్నికల్లో సింగిల్ విండో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పున:పరిశీలించాలని, ఐదు శాతం జనాభాలేని వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన బీసీలు అత్యధికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః పరిశీలించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు కూడా ప్రత్యేక యాక్ట్ పెట్టాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పదవులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరిండెంటులు, జీపీలు, పిపిలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50% వాటా కల్పించాని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటన్న గౌడ్, మదనాపూర్ మండల అధ్యక్షులు మహేందర్ నాయుడు, అన్నసాగర్ నరసింహ,శివ శంకర్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్