బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పుడు పెద్ద నటుల తలకు చుట్టుకున్నది. మొత్తం 25 మంది సినిమా, టివి, బిగ్ బాస్ నటుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసిన వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి టాప్ స్టార్స్ ఉండటం సంచలనం కలిగిస్తున్నది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొని వీళ్లంతా కోట్లాది రూపాయలు సంపాదించారు. వాళ్ళ ప్రచారాన్ని చూసి ప్రభావితులై బెట్టింగ్స్ లో పాల్గొని డబ్బులు పోగొట్టుకుని అప్పుల్లో కురుకుపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు, జీవితాలను శాశ్వతంగా ముగించుకున్న వాళ్ళు ఎందరో మరెందరో.
సీనియర్ ఐపిఎస్ అధికారి సజ్జనార్ పట్టుదలగా ఈ బెట్టింగ్స్ యాప్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్యరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, వైసీపీ శ్యామల, టేస్టి తేజ, రితు చౌదరి, బండారు సుప్రిత ఇలా మొత్తం 25 సినిమా, బుల్లితెర, సోషల్ మీడియా స్టార్ల పై కేసులు నమోదు చేశారు. సెలబ్రిటీలు అని కూడా చూడకుండా వెనక ముందు ఊగిసలాడకుండా ధైర్యంగా కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులకు, ఉన్నత పోలీస్ అధికారులకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.