26.2 C
Hyderabad
November 3, 2024 21: 05 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

పాక్ ఉగ్రమూకలపై భారత్ ఆకస్మిక దాడి

pakistan

గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో సైనిక బలగాలను పెంచుతున్న భారత్ నేడు పాకిస్తాన్ ఉగ్ర వాదుల శిబిరాలపై ఆకస్మిక దాడులు జరిపింది. కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు సైనికాధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ జరిపిన ఈ దాడిలో కనీసం 7 గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారని అంచనా. ఇందులో కొందరు పాకిస్తాన్ సైనికులు కూడా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఈ దాడి జరిగిందా లేక భారత సైన్యం భారత భూభాగం నుంచే కాల్పులు జరిపిందా అనే అంశం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భారత బోర్డర్ యాక్షన్ టీ ఈ దాడి చేసినట్లు కల్నల్ రాజేష్ కాలియా తెలిపారు. ఈ 7 గురు పాకిస్తానీయులు భారత సరిహద్దు దాటి వచ్చినట్లు గా ఆయన వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులను, అమర్ నాథ్ యాత్రీకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారనే ఇంటెలిజన్సు సమాచారంతో ఎలర్ట్ అయిన భారత్ భారీగా సైనిక బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ లోయ నుంచి ఇప్పటికే యాత్రీకులను, పర్యాటకులను తరలించిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుండగా భద్రతా బలగాలు ఈ దాడులు చేయడం గమనార్హం. కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర బలగాలకు చెందిన  పదివేల మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారికి వీరు అదనం. ఎక్కువగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కావడంతో రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరిగినా వెంటనే ఎదుర్కొనేందుకు వీరిని రంగంలోకి దించినట్టు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఆర్మీ, వాయుసేనలను అప్రమత్తంగా ఉండమని కేంద్రం ఆదేశించింది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు ఇతర దళాలు రెప్ప వాల్చకుండా సరిహద్దులను కాపలా కాస్తున్నాయి. రాష్ట్రంలో కేంద్ర బలగాల తరలింపునకు కేంద్రం వాయుసేనను రంగంలోకి దింపింది. పెద్ద విమానాలను ఇందు కోసం వినియోగిస్తున్నాయి. దీంతో సత్వరంగా దళాలను రాష్ట్రంలోకి తరలించనున్నారు. అయితే రాష్ట్ర గవర్నర్‌ మాత్రం ఉగ్ర దాడులు జరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా భద్రతా చర్యల కోసమే భారీగా కేంద్ర బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

Related posts

జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి

Satyam NEWS

కొత్త వేరియంట్ పై ఫేక్ ప్రచారాలు వద్దు

Bhavani

హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి

Satyam NEWS

Leave a Comment