33.2 C
Hyderabad
April 26, 2024 00: 34 AM
Slider విజయనగరం

మోడీ నియంతృత్వ విధానాలపై మరో స్వాతంత్ర్య పోరాటం

#AITUC

దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడు మహాకవి గురజాడ అప్పారావు గారు అన్నారు. కానీ ఈనాడు దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే కార్పొరేట్లోయ్ అని గుజరాతీ మోడీ ఆచరించి చూపిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు.

కేంద్ర కార్మిక, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు భారత్ బంద్ లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయుసి ఆధ్వర్యంలో  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు మొదలి శ్రీనివాసరావు నేతృత్వంలో పిడబ్ల్యూ మార్కెట్ నుంచి గంట స్థంభం, కన్యకపరమేశ్వరి ఆలయం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ భగత్ సింగ్, ఆజాద్, అల్లూరి, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో పోరాటయోధులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్వేచ్ఛ భారతాన్ని, ప్రజా సంపదని ఇవాళ మతోన్మాద, దేశభక్తి, శ్రీరాముని ముసుగులో నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలాంటి సంబంధం లేని ఆర్ఎస్ఎస్ భావజాలంతో నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అడ్డదారిలో మూడు వ్యవసాయ చీకటి చట్టాలు తీసుకు వచ్చి కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను అంబానీ ఆదాని ఐ టి సి  లాంటి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదన్నారు.

ఆ చట్టాలు రద్దు చేయమని ఢిల్లీ బోర్డర్లో దేశానికి అన్నం పెట్టే రైతన్న విరోచితమైన పోరాటం చేస్తు సుమారు 250 రైతన్నలు మృతిచెందినా మోడీ కసాయి ప్రభుత్వానికి చలనం లేకపోవడం చాలా దుర్మార్గమని బుగత అశోక్ ఆవేదన వ్యక్తంచేశారు.

44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా కుదించి కార్పొరేట్ యజమానుల కాళ్ళ దగ్గర కార్మిక జీవితాలను తాకట్టు పెట్టేందుకు కిటిలపన్నాగాలు పన్నితే కార్మికులందరూ ఏకమై బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ ఎర్రకోట కింద సమాధి కట్టడం ఖాయమని బుగత అశోక్ హెచ్చరించారు. దేశంలో కొనసాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనని అడ్డుకోడానికి ప్రజలందరూ ఐక్యంగా పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని ప్రజలను బుగత అశోక్ కోరారు.

ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు మొదలి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి 32 మంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాల తో 68 మంది సిపిఐ, వామపక్ష ఎంపీల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను మోడీ ప్రభుత్వం వందశాతం ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరిత నిర్ణయం చేసిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం రోజువారి ధరల విధానం పేరుతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె మొదలైన నిత్యావసర ధరలు పెంచుతు ప్రజలపై తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకి గురిచేస్తోందన్నారు.ఈ విధమైన ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా కల్సిరావలని మొదలి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ఎస్.సునీల్, వెలగాడ రాజేష్, బి.వాసు, ఐఎన్టీయూసీ నేతలు ఎన్ మహేష్, జి. అచీలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు పాల్గొన్నారు.

Related posts

రేపే బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు ఆంకురార్ప‌ణ‌

Satyam NEWS

బ్రహ్మోత్సవాలలో శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS

అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగితే?

Satyam NEWS

Leave a Comment