కుమారి రమ్యా సుబ్రమణియన్ భరతనాట్యం ఆరంగ్రేటం ఆదివారం రవీంద్ర భారతిలో కనులవిందుగా జరిగింది. తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ముఖ్య అతిధిగా హాజరయిన ఈ కార్యక్రమంలో రమ్య భరతనాట్య సాంప్రదాయంలో ప్రదర్శించిన పలు అంశాలు సభికులను అలరించాయి. భారత ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు డాక్టర్ కె.వి.సుబ్రమణియన్ కుమార్తె అయిన రమ్య శంకరానంద కళాక్షేత్ర లో పద్మశ్రీ డా. ఆనంద శంకర్ జయంత్ వద్ద పదేళ్ళ పాటు గురు శిష్య పరంపర సాంప్రా దాయంలో నృత్య శిక్షణ పొందారు. రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘భారతి వందన’ కు రమ్య చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. హరికేశనల్లూర్ మత్తయ్య భాగవతార్ కమాస్ రాగంలో స్వరపరిచిన వర్ణానికి రమ్య తన నృత్తాభినయాలతో రసజ్ఙులను ముగ్దులను చేసింది. మోహన కళ్యాఙి రాగంలొ చివరగా ప్రదర్శించిన థిల్లానా ప్రేక్షకులను రంజింప చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ రమ్య పిన్న వయస్సులోనే అంకిత భావం, పట్టుదల, కృషితో భరత నాట్య అభినయంలో పరిణతి ప్రదర్శించారని అన్నారు. రమ్య భరత నాట్యంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. భరతనాట్యం సంప్రదాయ నృత్య కళారూపాలలో ఎన్నదగినదని, రమ్య నాట్య కళాకారిణిగా మరింతగా రాణించాలని జోషి ఆకాంక్షించారు. భరతనాట్య కళలో రమ్య ఉన్నత స్ధానానికి చేరుకోవటానికి ఈ ఆరంగ్రేటం దోహదం చేయగలదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. నృత్యాభినయాలతో పాటూ రమ్యకున్న ఆమె ప్రతిభకు మరింత వన్నె తేగలదని, మరిన్ని విజయాలు అందికోగలదని మోదీ అభిలషించారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పంపిన సందేశాన్ని వేదికపై చదివి వినిపించారు. రమ్య భరత నాట్య ఆరంగ్రేటం భవిష్యత్లో ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు దోహదం చేయగలదని ఆకాంక్షించారు. తన అద్భుత ప్రదర్శనతో శంకరానంద కళాక్షేత్ర గర్వపడుతోందని ఈ సందర్భంగా ఆనందా శంకర్ అన్నారు. కళాక్షేత్ర శిష్యులలో రమ్యది 40వ ఆరంగ్రేటం అని అన్నారు. ప్రముఖ భరత నాట్య కళాకారిణి, పద్మశ్రీ డా. చిత్రా విశ్వేశ్వరన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘భారతి వందన’ ను ప్రదర్శించటాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి, తెలంగాణ కళలు సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా హాజరయ్యారు.
previous post