30.7 C
Hyderabad
April 24, 2024 02: 58 AM
Slider జాతీయం

Analysis: కుల రాజకీయాల బీహారం ఎవరికో

#BiharElections

మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీహార్ శాసనసభ ఎన్నికలు దేశంలోని రాజకీయపక్షాలకు సవాలుగా పరిణమిస్తున్నాయి. 243 స్థానాలకు దశాలవారీ జరిగే ఎన్నికలలో నిలిచి గెలుపు సాధించే దిశగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.

బీహార్ బరిలో బీజేపీ, జేడీ(యు) ఒకవైపు…కాంగ్రెస్, ఆర్ జేడీ , వామపక్షాలు,ఇతర ప్రాంతీయ పార్టీలు మరోవైపు ఉండగా….ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి (ఎల్ జె పీ) సొంతంగా ఎన్నికలలో పోటీచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ విశ్లేషకుల దృష్టినాకర్షిస్తోంది.

నితిష్ కు చెవిలో జోరీగలా చిరాగ్

ఇటీవల మృతిచెందిన దళితనేత రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినా బీహార్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎల్ పీజీ పార్టీ సుముఖంగాలేదని తెలుస్తోంది.

కేవలం నితీష్ కుమార్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఒకే అజెండాతో చిరాగ్ పాశ్వాన్ పాచికలు కదుపుతున్నారు. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రకటించిన ముఖ్యమంత్రి అభ్యర్థి తేజేశ్వర్ యాదవ్ 15 సంవత్సరాల నితీష్ కుమార్ పరిపాలన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి అసమర్థత,  అవినీతి కారణంగా రాష్ట్రంలో  చోటుచేసుకున్న సుమారు 60  కుంభకోణాలతో రూ.30 వేల కోట్ల పైచిలుకు ప్రజాధనం వృథా అయినట్లు యాదవ్ విమర్శిస్తున్నారు. ఈ విధమైన త్రిముఖ పోటీ బీహార్ రాజకీయాలలో వేడిపుట్టిస్తోంది.

ఆది నుంచి కులాలు శాసిస్తున్న రాజకీయం

2019 పార్లమెంట్ ఎన్నికలలో బీహార్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 40 ఎంపీ స్థానాలలో బీజేపీ-17 , జేడీ (యు)- 16, ఎల్ పీజీ – 6, కాంగ్రెస్ – 1 స్థానంలో గెలుపొందాయి. మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగానే బీహార్ ఎంపీ స్థానాలలో ఆధిక్యం సాధించినట్లు అప్పట్లో విశ్లేషకులు భావించారు.

మొదటినుంచి బీహార్ రాజకీయాలను కులాల బలాలు శాసించడం సహజం. బీహార్ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న యాదవులు, ముస్లిములు, దళిత వర్గాల మొగ్గుపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అంతే కాక… రాష్ట్రంలోని ఇతర వెనుక బడిన తరగతుల (ఓ బి సి) ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం.

గెలిచినా ఓడినా ఎన్ డి ఏ ప్రభావం శూన్యం

ఆర్ జే డి అధినేత లాలూప్రసాద్ యాదవ్  చెరసాల పాలు కావడంతో ఈ సారి బీహార్ ఎన్నికలలో ఆయన కుమారుడు తేజేశ్వర్ యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపోటముల ప్రభావం కేంద్రంలో ఉన్న ఎన్ డీఏ ప్రభుత్వంపై చూపించగల ప్రభావం ఏమీ లేదని పరిశీలకుల అభిప్రాయం.

అయితే…. ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ఆకర్షణ కారణంగా బీజేపీ అత్యధిక స్థానాలలో గెలిస్తే రాష్ట్రంలో నితీష్ కుమార్ కు ఎదురుదెబ్బ తగలవచ్చు. అటువంటి పరిస్థితి ఏర్పడితే ఎల్ జెపీ మద్దతుతో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. 

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఓట్లు చీలితే ఆర్జేడీ, ఎల్ జె పీ పార్టీలు లబ్ధిపొందగలవని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం  తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ రంగానికి చెందిన సవరణల చట్టం వంటి కీలక అంశాలలో నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత పెరిగినట్లు సమాచారం.

పాలకులపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసేవారేరి?

15 ఏళ్ళ సుదీర్ఘ ఏలుబడిలో అధికారపక్షం పై అసంతృప్తి ఉండడం రాజకీయాలలో సహజం. పాలకులపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూల ఓటుబ్యాంకు గా మార్చుకునే  సత్తాగల రాజకీయ పార్టీలు అనాయాస లబ్దిపొందగలవని చరిత్ర చెబుతోంది.

అధికారపక్షానికి దూరంకాగల ఓట్లు ఎల్ జె పీ కొల్లగొడుతుందా లేక ఆర్జేడీ కూటమి వైపు ఆ ఓట్లు మళ్ళు తాయా అనేది పరిశీలకులలో ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే …ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటిస్తున్న ప్రీ పోల్ సర్వేలు బీహార్ ఎన్నికల ఫలితాలు ఏక పక్షంగా ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి.

నితీష్ కుమార్ పై గతంలో ఉన్న విశ్వాసం కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.  వైరిపక్షం ఆర్ జె డీ- కాంగ్రెస్ కూటమి కొద్దిగా పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వేల సమాచారం. అదే జరిగితే బీజేపీ తీసుకునే నిర్ణయంపై బీహార్ అధికారపీఠం అధిరోహించేది ఎవరనేది నిర్ధారణ కాగలదని చెప్పవచ్చు.

రాజకీయాలలో మిత్రత్వం లేదా శతృత్వం శాశ్వతం కాదని అనేకసార్లు రుజువైంది. ఆ కోణంలో ఆలోచిస్తే నితీష్ కుమార్ కు చెక్ పెట్టేందుకు భాజపా పార్టీ చిరాగ్ పాశ్వాన్ ను తెరపైకి తెచ్చే  అవకాశాలను కాదనలేం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మార్పీఎస్

Satyam NEWS

జయహో భారత్: మా దేశ భక్తి ముందు కరోనా తల వంచాల్సిందే

Satyam NEWS

ఎమ్మెల్యే బొల్లా నుండి నాకు ప్రాణహాని ఉంది ..

Satyam NEWS

Leave a Comment