26.1 C
Hyderabad
May 15, 2021 04: 03 AM
Slider సంపాదకీయం

ఎంత మంది గొంతు నొక్కుతారు?

#Narendra Modi

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలం అయ్యారు…. ఈ వాక్యం కరెక్టో కాదో అందరికి తెలుసు. అయితే ఈ మాటలు చెప్పినందుకు సినీనటుడు సిద్దార్ధ్ తీవ్రమైన మాటల దాడికి గురవుతున్నారు.

నరేంద్ర మోడీ విఫలం అయ్యారు అనే మాట ఎవరైనా అంటేనే బీజేపీ తట్టుకోలేకపోతున్నది.

దేశంలో కరోనా వ్యాప్తి దారుణంగా జరుగుతూ ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు లేక జనం చచ్చిపోతుంటే ప్రభుత్వాన్ని కాక ఇంకెవర్ని విమర్శిస్తారు?

మోడీని ఆకాశానికి ఎత్తారు……

పైగా తొలి దశ కరోనా తన వల్లే కంట్రోల్ అయిందని నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. ఆయన చెప్పుకోవడమే కాదు. ఆయనను బిజెపి కార్యవర్గం ఈ విషయంలో ఆకాశానికి ఎత్తింది.

ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే మోడీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంది అంటూ బిజెపి కార్యకర్తల నుంచి బిజెపి జాతీయ అధ్యక్షుడి వరకూ మోడీని ఆకాశానికి ఎత్తారు.

మరి తొలి దశ కరోనా ను అదుపు చేసిన వ్యక్తి రెండో దశ కరోనాను ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఇదే దేశంలోని 14 కోట్ల మంది ప్రశ్నిస్తున్నారు.

130 కోట్ల లో 14 కోట్ల మంది మోడీని రాజీనామా చేయాలని కోరారు మిగిలిన వారు సమర్ధిస్తున్నట్లే కదా అని బిజెపి ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టింది.

సింగిల్ హ్యాండ్ తో బిజెపిని రెండో సారి అధికారంలోకి తెచ్చిన మోడీ విమర్శలను తట్టుకోలేని బలహీనుడా? రెండో వేవ్ రాగానే దేశంలో లాక్ డౌన్ విధించకుండా కేవలం పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం తాత్సారం చేయడం కరెక్టు కాదా?

పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశల్లో పోలింగ్ పెట్టారు. ఇది అవసరమా? తాను ప్రచారం చేసుకోవడానికి వీలుగానే ఎనిమిది దశల్లో పోలింగ్ ప్లాన్ చేశారు అంటే అది తప్పా? అదీ కూడా కరోనా సమయంలో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ పెట్టేస్తే సరిపోతుంది కదా అని ఎవరైనా అడిగితే అది దేశ ద్రోహమా?

లాక్ డౌన్ వల్లే మొదటి దశ కరోనా సమర్ధంగా అడ్డుకున్నామని చెప్పిన మోడీ రెండో దశ రాగానే లాక్ డౌన్ ఎందుకు పెట్టలేదు అని అడిగితే అది కూడా దేశ ద్రోహమేనా?

తొలి దశ కరోనా రాగానే రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరిస్తే ఆయనను ఏదీ చేతకాని అసమర్థుడిగా బిజెపి నేతలు చెప్పారు.

రెండో దశ కరోనా సమయంలో వ్యాక్సినేషన్ కరెక్టుగా చేయమని రాహుల్ గాంధీ సలహా ఇస్తే ఎద్దేవా చేశారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింగ్ ఎంతో అనుభవంతో కొన్ని సూచనలు చేస్తే వాటినీ పక్కన పడేశారు.

వ్యాక్సిన్ ముందు మన దేశం వారికి ఇవ్వండి ఎగుమతులు ఆపండి అని రాహుల్ గాంధీ చెబితే దానిపై బిజెపి వాట్సప్ యూనివర్సిటీ విరుచుకుపడింది.

ఎంత మంది నోరు నొక్కుతారు? ఇలా నోరు నొక్కుతుండం వల్లే 14 కోట్ల మంది తిరుగుబాటు చేశారు. ఆ 14 కోట్ల మందిలో సినీ నటుడు సిద్దార్ధ్ కూడా ఒకరు.

ఈ మాత్రానికే ఆయనను చంపుతామని, నరుకుతామని, ఆయన కుటుంబ సభ్యుల్ని రేప్ చేస్తామని బెదరిస్తారా? సిద్దార్ధ్ ఫోన్ నెంబర్ ను వాట్స్ యాప్ లో ప్రచారం చేసి అందరిని ఫోన్ చేయమని ప్రేరేపించి ఆయనను భయబ్రాంతులకు గురిచేయాలని చెప్పడం ప్రజాస్వామ్య లక్షణమా?

ఇలాంటి పనులు మోడీ భయాన్ని తెలియచేస్తున్నాయి. నిజమైన నాయకుడు విమర్శలను ఎదుర్కొవాలి. వాటికి సమాధానం చెప్పుకోవాలి.

చేతనమైతే అసలు విమర్శలే రాకుండా చేసుకోవాలి. పరిశోధనలో సహకారం అందించి, వ్యాక్సిన్ తయారు చేయడానికి రుణం ఇచ్చిన కంపెనీల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలా?

దీన్ని కూడా విమర్శించకూడదా?

మన దేశంలో వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి వీలైతే విదేశాలకు అమ్ముకోవాలి. అంతే కాని టాక్స్ పేయర్స్ మనీని కంపెనీలకు ఇచ్చి వారి నుంచి వ్యాక్సిన్ కోనుక్కోండి అంటే…? దీన్ని కూడా విమర్శించకూడదా? దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పలేదా?

మన దేశంలో మన డబ్బుతో వ్యాక్సిన్ రూపొందించిన కంపెనీలకు మన దేశంలో వ్యాక్సిన్ అమ్ముకునేందుకు ధరలు నిర్ణయించుకునే అధికారం ఇవ్వడం ఏమిటి? కంపెనీలు ధరలు నిర్ణయించుకుంటే ప్రధాని నరేంద్ర మోడీని నిందిస్తున్నారు అంటూ బిజెపి చెప్పడం ఏమిటి?

మోడీకి తెలియకుండానే, ఆయన అనుమతి లేకుండానే ప్రయివేటు కంపెనీలు వ్యాక్సిన్ కు ధరలు నిర్ణయించాయా? సమర్ధమైన నాయకుడు అయితే కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలను పిలిచి వ్యాక్సిన్ కు ధర నిర్ణయించి దేశంలోని ప్రజలందరికి రెండు డోసులు ఉచితంగా ఇవ్వాలి.

ఆ తర్వాత ఎవరి వ్యాక్సిన్ వారే వేయించుకోవాలి అని చెప్పాలి. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆసుపత్రులుల లేవు, వాటిలో బెడ్లు లేవు, బెడ్లకు ఆక్సిజన్ లేదు… కరోనా సమయంలో రోగికి ఇవ్వాల్సిందే ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్ లేకుండా చేసిన నరేంద్ర మోడీని విమర్శించాలా?

గుజరాత్ కు మాత్రం అవసరం లేకపోయినా……

బిజెపి అత్యంత విధేయులైన కార్యకర్తల్లా నెత్తిన పెట్టుకోవాలా? కేసులు పెరుగుతున్న తెలంగాణ అడిగితే రెమిడిస్వేర్ ఇంజక్షన్లు ఇవ్వని నరేంద్రమోడీ గుజరాత్ కు మాత్రం అవసరం లేకపోయినా వాటిని ఇచ్చేస్తున్నారు….

ఈ మాట చెప్పినందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను దారుణంగా విమర్శిస్తున్నారు.

మైడియర్ కమలం సోదరులారా పాలకులను గుడ్డిగా సమర్ధించి వారిని నియంతలుగా మార్చకండి. అలా చేసిన కాంగ్రెస్ భూస్థాపితం అయింది… వ్యక్తి ఆరాధనలో పడితే మీకూ వినాశనం తప్పదు.

Related posts

అయ్యన్న పేట కోనేరు వద్ద 16 ల‌క్ష‌ల‌తో లైటింగ్ ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

ఈ సారి రేషన్ లో కందిపప్పు ఇవ్వడం లేదు

Satyam NEWS

లైంగిక నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!