30.7 C
Hyderabad
April 19, 2024 07: 33 AM
Slider ప్రత్యేకం

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

#Somu Veeraju

భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ నాయకత్వ మార్పులు చేపట్టింది. కొత్త రథ సారధులను నియమిస్తోంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ  కొత్త నేతలు  వచ్చారు. తెలంగాణలో ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమించారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యక్షుడుగా సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. బిజెపి పరంగా ఇది మంచి పరిణామం. పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్ధమవుతోంది. జమిలి ఎన్నికలు రాకపోతే సుమారు 4ఏళ్ళు, వస్తే 2ఏళ్ళ కాల వ్యవధి ఉంది.

ఆంధ్రా కాపు, తెలంగాణ మున్నూరు కాపు

నిస్సందేహంగా  క్షేత్రస్థాయి నుండి బలోపేతం చెయ్యవలసిన అవసరంలోనే పార్టీ ఉంది. ప్రస్తుత నియామకాల్లో సంప్రదాయ బిజెపి వాదులనే ఎంపిక చేస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ మొదటి నుండి ఆర్ ఎస్ ఎస్ నేపధ్యం ఉన్నవాడే. ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజు కూడా చిన్న వయస్సు నుండి ఆ భావజాలం నుండి వచ్చినవాడే.

విద్యార్థి పరిషత్, యువమోర్చాలో సుదీర్ఘకాలం పనిచేసిన సుశిక్షుతుడైన కార్యకర్త. తెలంగాణలో,  బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి  చెందిన బండి సంజయ్ ను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో,  బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజును ఎంపిక చేశారు.

బిజెపి జనసేనకు అవకాశం

కొన్నాళ్ల నుండి మళ్ళీ  జనసేన -బిజెపి కలిసి సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను బిజెపితో అనుసంధానం చేసినవాడు సోము వీర్రాజు. పవన్ -సోము వీర్రాజు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కూడా.

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి -జనసేన ద్వయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారన్నది కాలంలోనే తెలుస్తుంది. రెండు పార్టీలు కూడా బూత్ స్థాయి నుండి పార్టీని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం బలంగా ఉంది. వీరి విజయం దీనిపైనే ఆధారపడివుంది.

చక్రం తిప్పేది కమ్మా రెడ్డి

ఎన్నో ఏళ్ళ నుండి ఓటు బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయి. పైకి ఎన్ని మాటలు చెప్పినా, సామాజిక వర్గాల పాత్ర కొట్టిపారేయలేనిది. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, కాపు మూడు సామాజిక వర్గాలు బలమైనవి. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ నుండి రెడ్డి, కమ్మ వర్గాలే చక్రం తిప్పుతూ పాలకులుగా ఉన్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో కాపు సామాజిక వర్గానికి బలమైన రాజకీయ ఊతం వచ్చింది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత  ఆ స్థానంలో  పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు.  ఎన్నికల్లో  ఆశించినంత ఫలితాలు రాకపోయినప్పటికీ,సామాజిక  ప్రభావం తప్పకుండా ఉంటుంది.

ప్రస్తుతం కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం వై ఎస్ ఆర్ పార్టీతోనే ప్రయాణం  చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. భావి రాజకీయాల్లో కాపు వర్గం కొంత దూరమైనప్పటికీ,బీసీల బలం పార్టీకి ఉపయోగ పడుతుందనే వ్యూహం కూడా వుండి ఉండవచ్చు.

ఏపిలో బలమైన పునాదులు లేవు

టిడిపి-బిజెపి మళ్ళీ జతకట్టి రాజకీయాలు చేసే పరిస్థితులు ఉండక పోవచ్చు. బిజెపిని బలోపేతం చేసుకుంటూ, కాపు సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ను, జనసేన బలాన్ని కలుపుకొని ముందుకు  సాగడమే లక్ష్యంగా  బిజెపి కొత్త సారథి అడుగులు వేస్తాడని భావించవచ్చు.

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి బలమైన పునాదులు ఏర్పడలేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు కూడా లేరు. క్యాడర్, ఓటింగ్ కూడా అంతంత మాత్రమే. గతంలో ఉన్న నాయకులు పార్టీని పెద్దగా ఎదగ నివ్వలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేదు.

టిడిపికి బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉన్నా, ఇమేజ్ బాగా దెబ్బతింది. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో బిజెపి బలం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే పరిస్థితులు బిజెపి-జనసేన ద్వయానికి ఉన్నాయని  ఇప్పుడే చెప్పడం అవివేకమవుతుంది.

ముందు, ఈ పార్టీలు క్షేత్రస్థాయిలో బలోపేతమవ్వాలి. గతంలో బిజెపికి జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ముందుకు సాగడమే కొత్త అధ్యక్షుడి తక్షణ కర్తవ్యం. సోము వీర్రాజు పార్టీలో ఎప్పటి నుండో ఉన్న వ్యక్తి. ఎం.ఎల్.సి గానూ పనిచేశారు.

చంద్రబాబు వ్యతిరేకి సోము

అవినీతి ముద్ర  వేసుకోక పోవడం అభినందనీయం. ఆవేశంగా, సంచలనాత్మకంగా మాట్లాడతారనే పేరు బాగా ఉంది. మొదటి నుండీ,  టిడిపికి, చంద్రబాబుకు వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తిగానే ఈయనకు ముద్రపడింది. గతంలో టిడిపి-బిజెపి కలిసి సాగిన సందర్భాల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకమైన నినాదలే చేశారు.

బిజెపి బంధం నుండి తెగతెంపులు చేసుకొని టిడిపి బయటకు వచ్చిన తర్వాత, వీర్రాజు తన స్వరం మరింత పెంచి మాట్లాడారు. నిన్నటి వరకూ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా టిడిపి, చంద్రబాబు వ్యతిరేక వర్గం నుండి వచ్చినవారే. 2019 ఎన్నికల ఫలితాల ముందు ఆయన వినిపించిన స్వరం వేరు, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నినదించిన స్వరం వేరు.

ఒక్కమాటలో చెప్పాలంటే, టిడిపి వాళ్ళ కంటే కూడా తీవ్రస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శనా బాణాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీ చేసే తప్పులను ఎండగట్టడం సర్వ సహజమైన అంశం. కానీ, కన్నా స్వరం మరింత కఠినంగా వినపడింది. గతంలో చంద్రబాబుపై కూడా అదే రీతిలో మాట్లాడారు.

అటు పోవాల్సిన కన్నా ఇటు

మొదటి నుండి టిడిపికి బద్ధ వ్యతిరేకమైన కాంగ్రెస్ నాయకుడుగా కన్నా వైఖరికి అప్పుడు ఎవ్వరూ ఆశ్చర్య పడలేదు. జగన్ పై వినిపించిన స్వరమే పలు అనుమానాలకు తావు ఇచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ  వై ఎస్ ఆర్ పార్టీలోకి రావాల్సిన వ్యక్తి. ముహూర్తం పెట్టుకొని, అంతా సిద్ధం చేసుకొన్నారు.  తృటిలో వ్యూహం మార్చుకొని ,  బిజెపిలో చేరిపోయారు.

అందర్నీ “అమితా”శ్చర్యంలోకి నెట్టేశారు. తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. కన్నా సమయంలో బిజెపి ఎదగక పోగా, ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది. ఎప్పటి నుండో కన్నాను మారుస్తారనే వార్తలు వినిపించాయి. కొత్త అధ్యక్షుడిగా  సోము వీర్రాజుతో పాటు  పురందరేశ్వరి, మాధవ్ పేర్లు కూడా బాగా వినపడ్డాయి.

ఎక్కువగా మాధవ్ పేరు వినపడింది. మాధవ్ బీసీ వర్గానికి చెందిన నేత. సీనియర్ నాయకులు చలపతిరావు కుమారుడు. వీరిద్దరినీ పక్కన పెట్టి, నేడు సోము వీర్రాజును సారథిగా ఎన్నుకున్నారు. ఇందులో మొదటి కారణం ఇతను  సంప్రదాయ బిజెపి వాది. పవన్ కళ్యాణ్ తో గట్టి సంబంధాలు కల్గి ఉండడం రెండవ కారణం.

విధేయతకే పెద్ద పేటీ

కాపు సామాజిక వర్గాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోవడం మరో ముఖ్య కారణం. గతంలో అధ్యక్షుడుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవాడు అయివుండడడం గమనార్హం. మిగిలిన రాష్ట్రాలలో  అధ్యక్షుల  ఎంపికలోనూ సామాజిక సమీకరణలు,పార్టీ విధేయతకే బిజెపి అధిష్ఠానం  అగ్రతాంబూలం  ఇస్తోంది.

రాష్ట్ర కొత్త అధ్యక్షుడుగా వచ్చిన సోము వీర్రాజు  వై ఎస్ ఆర్ పార్టీ, జగన్ ప్రభుత్వంపై ఎటువంటి స్వరం వినిపిస్తాడో వేచి చూడాల్సిందే. టిడిపి నుండి, హిందుత్వ వాదుల నుండి, అసంతృప్తి వర్గాల నుండి బిజెపి వైపుకు ఎంతమందిని మళ్లిస్తారో  భవిష్యత్తు చెబుతుంది.

అధ్యక్షుడికి అంతగా స్వేచ్ఛ ఉంటుందా?

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రం సహకారాన్ని ఏ రీతిలో అందేలా చూస్తారో సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. మూడు రాజధానులు, పోలవరం, విశాఖపట్నం రైల్వే జోన్ సమస్యలు మొదలైన  ఎన్నో అంశాలు తన ఎదురుగా ఉన్నాయి. బిజెపి జాతీయ పార్టీ. దానికి విధి విధానాలు, నిర్మాణం, పర్యవేక్షణ చాలా ఉన్నాయి.

స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకొని, వ్యాఖ్యలు చేసి , వ్యవహారాలు నడిపే స్వేచ్ఛ రాష్ట్ర అధ్యక్షుడికి పెద్దగా ఉండదు. కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన స్కూల్ వేరు.సోము వీర్రాజు స్కూల్ వేరు. ఇతను  అసలు సిసలైన బిజెపి భావజాలం నుండి వచ్చిన సుశిక్షితుడైన నాయకుడు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి  వాక్యూమ్ (రాజకీయ సూన్యత) ఉంది.పార్టీ  గతంలో,  వివిధ వర్గాలను కలుపుకొని సాగడంలో సరియైన ప్రయత్నాలు చెయ్యలేదు.

సోముకు సవాళ్లు ఎక్కువే

ఎవ్వరినీ నాయకులుగా ఎదగనివ్వలేదు. పేస్ వాల్యూ ఉన్న నాయకులు పట్టుమని పదిమంది కూడా లేరు. సంస్థాగత నిర్మాణంలో ఘోరమైన వైఫల్యాలు  ఉన్నాయి. కాపు ముద్ర పడడం కొంత లాభం. కొంత నష్టం. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించడం కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎదురుగా ఉన్న సవాళ్లు.

ఇది మంచి తరుణం. వీరు చేపట్టే చర్యలే వ్యవస్థాగతంగా బిజెపికి, వ్యక్తిగతంగా సోము వీర్రాజుకు బలమైన పునాదులవుతాయి. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ -జనసేన వైఖరి కూడా కీలకం. ఇద్దరు మిత్రులు రెండు పార్టీలను ఏం చూస్తారో, చూద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

వృధ్ధురాలి హత్యకేసు ఛేదించిన పార్వతీపురం పోలీసులు

Satyam NEWS

వైసీపీ రెడ్ల డిఎన్ఏ పార్టీ మాత్రమే, దళితులది కాదు

Bhavani

పిచ్చుక

Satyam NEWS

Leave a Comment