27.7 C
Hyderabad
March 29, 2024 04: 21 AM
Slider సంపాదకీయం

పసుపు బోర్డు… ప్రత్యేక హోదా… ఇంకెన్ని అసత్యాలు???

#NarendraModi

తెలుగు రాష్ట్రాలు ఈ భారత దేశంలో భాగమేనా అనే అనుమానం కలిగించే విధంగా బిజెపి ప్రవర్తిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.

కాంగ్రెస్ తనంతటతాను చెప్పలేదు బిజెపి అడిగితే హామీ ఇచ్చింది. కాలం గడుస్తున్నా బిజెపి ఆ హామీ నెరవేర్చకపోగా ఇప్పుడు లోక్ సభ సాక్షిగా మొడిచెయ్యి చూపింది. అలాగే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసేసింది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెప్పినప్పుడు ‘నిజమే కాబోలు’ అని మోడీ అభిమానులు అనుకున్నారు. పసుపు బోర్డు కాన్సెప్టే లేదు, స్పైసెస్ బోర్డే అన్నీ చూస్తుంది అని చెప్పినప్పుడు కొంత బాధ కలిగినా ‘నిజమే కాబోలు’ అని నిజామాబాద్ పసుపు రైతులు కొందరు అనుకున్నారు.

కాంగ్రెస్ కన్నా దారుణంగా….. బీజేపీ

అయితే బిజెపి ఏం చేస్తున్నదో తెలిసి అందరూ నివ్వెరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో విసిగిపోయి బిజెపిని గెలిపిస్తే ఈ పార్టీ కూడా అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బిజెపి స్పష్టం చేసింది.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇస్తూ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నది. ఇదేం చండాలపు రాజకీయం? ఈ ప్రశ్నను ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ ప్రజలు వేస్తున్నారు. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు.

అశ్చర్యకరంగా ఇప్పుడు బిజెపి నేతలు ఆ నాడు నరేంద్రమోడీ అలా చెప్పలేదు అంటున్నారు. నిజామాబాద్ లో పసుపుబోర్డు ఇచ్చేది లేదని లోక్ సభలో సంబంధిత మంత్రి చెప్పగా పసుపు రైతులు నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తీసుకువస్తాను నాకు ఓటేయండి అని అడిగి గెలిచిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఏకంగా రైతులను బెదిరిస్తున్నారు.

దేశంలో నీతీ ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే విధానమేలేదని చెప్పిన బిజెపి పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా హామీ ఇస్తుంది? సుగంధ ద్రవ్యాల బోర్డే పసుపు విషయాలను కూడా చూస్తుందని పార్లమెంటులో సమాధానం ఇచ్చిన మంత్రి మాటలకు భిన్నంగా తమిళనాడులో పసుపు బోర్డు హామీని బిజెపి ఎలా ఇస్తుంది?

పక్క రాష్ట్రాలతో పోలిక ఎందుకు? ఏ రాష్ట్రం విధానం ఆ రాష్ట్రానిదే అని బిజెపి నేతలు చెబితే అంతకన్నా ఆత్మ వంచన మరొకటి ఉండదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకు అన్యాయం చేసి భారత దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తామని చెబుతుంటే అది విని నవ్వుకోవడమే చేయాల్సింది.

బిజెపి విధానాలను ప్రశ్నించిన వారంతా దేశద్రోహులే అని బిజెపి వాట్సప్ యూనివర్సిటీ కనిపెట్టిన సిద్ధాంతం ఇప్పుడు దేశం మొత్తం అమలు జరుగుతున్నది. రెండు సీట్ల నుంచి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిన బిజెపి హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుంది కానీ నీచమైన రాజకీయాలు చేస్తే ఎన్నికల్లో గెలిచినా నైతికంగా ఓడిపోతుంది…. కర్నాటకలో లాగా…

Related posts

తూర్పుగోదావరి జిల్లాలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటన

Satyam NEWS

చెదిరిన ‘‘రంగుల కల’’: ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి

Satyam NEWS

మేడారం జాతర పనులపైన నిర్లక్ష్యం వద్దు

Satyam NEWS

Leave a Comment