నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత 5 ఏళ్లలో తెలంగాణ కి ఒరగబెట్టింది ఏమి లేదని ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆంధ్రా లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వమని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. వరంగల్, మడికొండ వద్ద వాహనాలకు జెండా ఊపి కాళేశ్వరం సందర్శన యాత్రను ప్రారంభించిన కడియం శ్రీహరి అనంతరం మేడిగడ్డ బ్యారేగిని సందర్శించి, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ని చూసి.. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించి..ఆలయ ప్రాంగణంలోనే అన్నం తిని అన్నారం బ్యారేజిని చేరుకుని అక్కడి నుంచి హన్మకొండ కు తిరిగి పయనమైయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కి నిధులు ఇవ్వకుండా, రాష్టాన్ని పట్టించుకోకుండా ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలని ఆయన అన్నారు. అసలు తెలంగాణలో బిజెపి లేనేలేదని, గాలివాటున నాలుగుసీట్లు గెలవగానే బిజెపి మిడిసిపడుతున్నదని ఆయన అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్ల అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులు కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్తున్నాం. ఇది సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం అని ఆయన అన్నారు.
previous post