34.2 C
Hyderabad
April 23, 2024 11: 47 AM
Slider సంపాదకీయం

దిగజారిన బిజెపి: చీప్ లిక్కర్ కామెంట్: జిన్నా టవర్ వివాదం

#bjpap

పార్టీ పరంగా పూర్తి స్థాయిలో అయోమస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి కొత్త కొత్త అంశాలను తెరపైకి తెచ్చే విఫలయత్నం చేస్తున్నది. బిజెపిలో రెండు వర్గాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఒకటి చంద్రబాబు వ్యతిరేక కూటమి. ఈ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోరాటం చేయకుండా ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ధ్వజం ఎత్తుతూ ఉంటుంది.

రెండోది తెలుగుదేశం అనుకూల వర్గం. ఈ వర్గం ప్రతిపక్ష పార్టీని కాపాడుతూ అధికార వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటుంది. కేంద్రంలోని బిజెపి పెద్దలు ఒక సారి అటూ మరో సారి ఇటు ఊగుతూ రాష్ట్ర పార్టీ మొత్తాన్నీ అయోమ స్థితిలోకి నెడుతోంది. చంద్రబాబు వ్యతిరేక కూటమికి సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకుడిగా ఉన్నారు. దాంతో ఆయన తరచూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలమైన వాదనలు పరోక్షంగా వినిపిస్తూ ఉంటారు.

చంద్రబాబును విమర్శించడంలోనే సోముకు ఆనందం

చంద్రబాబు అధికారం కోల్పోయి మూడేళ్లు గడిచినా ఇంకా చంద్రబాబును తిట్టడంలోనే సోము వీర్రాజు ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. తెలుగుదేశంపార్టీ నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్ లు ఈ విషయాన్ని కేంద్ర పార్టీకి పలుమార్లు చెబుతూ వచ్చారు. దాంతో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జగన్ వ్యతిరేక కూటమికి తలంటు పోశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దాంతో జగన్ అనుకూల కూటమికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా అయింది.

ఈ సందర్భంగా అన్యమనస్కంగానే జగన్ కు వ్యతిరేకంగా జనాగ్రహ సభ ను బిజెపి నాయకులు నిర్వహించారు. జనాగ్రహ సభ పూర్తిగా విఫలం అయింది. ఈ సభలో సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన ప్రకటనతో అప్పటి వరకూ బిజెపి అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న వారు కూడా ఆ పార్టీ అంటే అసహ్యించుకున్నారు. లిక్కర్ బాటిల్ 70 రూపాయలకే ఇస్తామని, కోటి మంది తమకు ఓటు వేయాలని సోము వీర్రాజు ఆ సభ ద్వారా కోరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గమనించుకున్న తర్వాత లిక్కర్ 50 రూపాయలకే ఇస్తామని కూడా ఆయన చెప్పారు.

బిజెపి సాంప్రదాయ ఓటర్లలోనే వ్యతిరేకత

దాంతో సాంప్రదాయ బిజెపి ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మద్యం ఆసరాగా బిజెపి అధికారంలోకి రావాలని చూడటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడం అటుంచి ఈ సభతో బిజెపి అపహాస్యం పాలైంది. వైసిపి, టిడిపి బిజెపి అంటే భయపడేవి. జనాగ్రహ సభ నిర్వహణ తర్వాత బిజెపి బలం ఎంతో తేలిపోవడంతో అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ కూడా బిజెపిపై దారుణమైన విమర్శలు చేశాయి.

ఈ రెండు పార్టీలనూ టార్గెట్ చేయాలనుకున్న బిజెపినే టార్గెట్ అయింది. బిజెపి నిర్వహించిన సభ ఎవరినీ ఆకట్టుకోలేదు. సోము వీర్రాజు వ్యాఖ్యలు పార్టీ పరువు తీశాయి. సభస్ర్ర్కిప్ట్ చంద్రబాబు రాసినట్లు ఉందని వైసిపి, జగనన్న సభలాగా జరిగిందని టిడిపి వ్యాఖ్యానించాయి. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ లాంటి సీనియర్ నేత వస్తున్నా జనం ఎందుకు రాలేదో బిజెపి నేతలు ఆలోచించుకోవాలి.

అయితే ఈ విషయం మానేసి బిజెపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. చీప్ లిక్కర్ వ్యాఖ్యల్ని మరుగున పెట్టేందుకు, జిన్నా టవర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. గుంటూరు పట్టణంలో ఉన్న జిన్నా టవర్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీజేపీ నేత సత్య కుమార్‌.. ‘ఈ టవర్‌కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్‌గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్‌లో కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్‌కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్‌కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్‌ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. జిన్నా గొప్ప దేశ భక్తుడని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. బిజెపి ప్రయత్నాన్ని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోము వీర్రాజు చీప్ లిక్కర్ కామెట్ ను మరుగున పెట్టేందుకు బిజెపికి జిన్నా ఉపయోగపడుతున్నాడు.

Related posts

కేసీఆర్ ఐడియాను కాపీ కొట్టిన జగన్

Bhavani

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment