26.7 C
Hyderabad
June 22, 2024 04: 55 AM
Slider సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కుమ్ముక్కు రాజకీయం?

#YS Avinash Reddy

వై ఎస్ అవినాష్ రెడ్డి, కల్వకుంట్ల కవితలను సీబీఐ, ఈడీ అరెస్టు చేయలేకపోవడం పరోక్షంగా రెండు తెలుగు రాష్ట్రాలో బీజేపీకి రాజకీయంగా తీరని నష్టం తెచ్చిపెడుతున్నది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఆ మధ్య కాలంలో ప్రధానంగా ప్రస్తావనలోకి వచ్చింది.

ఆమెకు సీబీఐ, ఈడీ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత ఆమె విచారణకు హాజరు కావడం కూడా జరిగింది. నేడో రేపో కవితను అరెస్టు చేస్తారనే అందరూ అనుకున్నారు. తెలంగాణ బిజెపి నాయకులైతే ఇదిగో ఒక కవిత అరెస్టే తరువాయి అంటూ ప్రకటనలు కూడా ఇచ్చారు. పెద్ద ఎత్తున వార్తలు వచ్చి ఇప్పటికి చాలా కాలం అయినా కవిత అరెస్టు

కార్యరూపంలోకి రాలేదు. దాంతో కేంద్రంలోని బీజేపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవితను అరెస్టు చేయలేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో ఆయన ఈ విమర్శలు తీవ్రతరం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాటి నుంచి ఈ విమర్శ పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు కావడం వల్లే కవిత అరెస్టు జరగలేదని ఎక్కువ మంది భావిస్తుండటంతో తెలంగాణ లో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతున్నది.

ఇతర పార్టీ ల నించి బీజేపీలో చేరిన కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఈ వాదనతో పునరాలోచనలో పడ్డట్టు కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుదామనుకున్న బీజేపీకి కవిత అరెస్టు వ్యవహారం గుదిబండగా మారింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఆయన సోదరుడు, కడప ఎంపి వై ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ ఆడుతున్న దాగుడుమూతలు అక్కడి బీజేపీకి శాపంగా మారాయి.

ఏపిలో బీజేపీకి ఓట్లు లేకపోయినా బీజేపీ సానుభూతి పరులు కూడా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా కాలయాపన చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పూర్తిగా సహకరిస్తున్నందువల్లే అవినాష్ రెడ్డి అరెస్టు జరగడం లేదని అందరూ భావిస్తున్నారు. రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా కేంద్రంలోని బీజేపీ పట్టించుకోవడం లేదని ఇప్పటికే బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ సానుభూతిపరులు ఈ చర్యతో మరింత మండిపడుతున్నారు.

మర్డర్ కేసులో నిందితులను కూడా సీబీఐ అరెస్టు చేయలేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ కారణాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలా వ్యవహరించాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు ఇస్తున్నదనే వాదన బలంగా వినిపిస్తున్నది. సీబీఐ అధికారులు కర్నూలులో ఏమీ చేతగాని వారిలా స్థానిక పోలీసుల సహాయం కోరడం,

అదివ్వడానికి వారు సీఎం కార్యాలయ అనుమతి కోరడం, అక్కడ నుంచి సమాధానం రాకపోవడంతో స్థానిక పోలీసులు సీబీఐకి సహకరించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. న్యాయపరమైన, సాంకేతిక అంశాల విషయం ఎలా ఉన్నా కూడా బీజేపీ, వైసీపీ రాజకీయ ఒప్పందం వల్లే అవినాష్ రెడ్డి అరెస్టు జరగడం లేదనే చర్చ జరుగుతున్నది.

Related posts

104 పాఠశాలల్లో పనులు పూర్తి

Murali Krishna

పాకిస్తాన్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వార్నింగ్

Sub Editor

కలెక్టర్ ను కలిసిన సెర్ప్ ఉద్యోగులు

Murali Krishna

Leave a Comment