కొల్లాపూర్ రాజాగారి కోట ను ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం, దానిపై నిర్మాణాలు ప్రారంభించడం తదితర అంశాలను తక్షణమే అడ్డుకోవాలని లేకపోతే కొల్లాపూర్ పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని సోమవారంనాడు ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాం కు భారతీయ జనతా యువ మోర్చా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి ఎస్ రమేష్ రాథోడ్ ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ రాజాగారి కోట కాంపౌండ్ ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో కొందరు నాయకుల మద్దతుతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట ప్రాంతంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కొల్లాపూర్ పట్టణం మొత్తం ఇరుకుగా మారుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ వేంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ మండపం తదితర ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయని అక్రమ నిర్మాణాలు చేపడితే ట్రాఫిక్ స్తంభించి పోతుందని ఆయన అన్నారు. కోట వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం, విశాలమైన పార్కు అభివృద్ధి తదితర ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆయన కోరారు. కొల్లాపూర్ పట్టణానికి గర్వకారణమైన రాజాగారి కోట ఈ విధంగా ఆక్రమణలకు గురి కావడం, కోట స్థలాన్ని కొందరు పెద్దలు అక్రమంగా అమ్ముకోవడం, దీనికి కొందరు ప్రజాప్రతినిధులు సహకరించడం తదితర కార్యక్రమాలపై ఇప్పటికే కొల్లాపూర్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి పర్యవసానమే ఈ ఫిర్యాదుగా చెబుతున్నారు. కోట స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని రమేష్ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట స్థలానికి సంబంధించి ఏవైనా అనుమతులు ఇప్పటికే ఇచ్చి ఉంటే వాటిని తక్షణమే రద్దు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
previous post