28.2 C
Hyderabad
June 14, 2025 10: 57 AM
Slider ముఖ్యంశాలు

BJP Open letter: 10వ తేదీన కాణీపాకం వస్తావా రాచమల్లూ?

#vishnuvardhanreddy

దేశ ద్రోహి అయిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అడ్డుకున్నందుకు ఉక్రోషంతో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాణిపాకం వినాయకుడి ముందుకు వచ్చి ప్రమాణం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీన కాణీపాకం రావాలని, తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించాలని విష్ణువర్ధన్ రెడ్డి తన లేఖలో కోరారు. విష్ణు వర్ధన్ రెడ్డి లేఖ పూర్తి పాఠం ఇది:

సచ్ఛీలతపై ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డికి బహిరంగ ఆహ్వానం

నా సచ్చీలతను నిరూపించుకునేందుకు కాణిపాకం వినాయకుని ఎదుట ఈ నెల 10న ప్రమాణం చేస్తాను. దమ్ముంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చి తన సచ్చీలతను నిరూపించుకోవాలి. రాజకీయాల కోసం హిందూ ద్రోహి టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడానికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రయత్నించడంతో రాజకీయంగా విమర్శలు చేశాను. దానికి శివప్రసాద రెడ్డి సరైన వివరణలు ఇవ్వలేకపోగా, నాపై వ్యక్తిగత విమర్శలతో పాటు తప్పుడు అవినీతి ఆరోపణలను చేశారు.

దానిని నేను ఖండిస్తూ ” నా మీద చేసిన ఆరోపణలను అసత్యాలని పేర్కొంటూ కాణిపాకంలోని దేవుని సన్నిధిలో పది రోజుల్లో ప్రమాణం చేస్తానని విశాఖలో మీడియా సమావేశంలో చెప్పాను. భాజపా కార్యకర్తలపై జరిగిన దాడులు, హత్యాయత్నం సంఘటనల్లో మీ అనుచరులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉందన్న నా ఆరోపణలు అసత్యాలని కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని బహిరంగంగా కోరాను.

అయితే శివప్రసాద రెడ్డి ఈ విషయంలో ఏ మాత్రం స్పందించకుండా దొంకతిరుగుడు సమాధానాలతో తప్పించుకుంటున్నారు. ఏ రోజున కాణిపాకం వస్తారో తేదీని శివప్రసాద్ రెడ్డి ప్రకటించనందున నేనే ఆ తేదీని బహిరంగంగా ప్రకటిస్తున్నా.

ఆగస్టు 10వ తేదీన ఉదయం 11 గంటలకు కాణిపాకంలో స్వామివారి సన్నిధిలో ఉంటాను. నా మీద చేసిన ఆరోపణలను అసత్యాలుగా పేర్కొంటూ ప్రమాణం చేస్తాను. ఎమ్మెల్యే శివప్రసాద్ కూడా వచ్చి తాను చేసిన ఆరోపణలను అసత్యాలని ప్రమాణం చేయాలి.

అందువల్ల ఆగస్టు పదో తేదీన కాణిపాకం రావాలని శివప్రసాద రెడ్డిని బహిరంగంగా ఆహ్వానిస్తున్నా. ఆ రోజున రావడం, రాకపోవడం ఆయన ఇష్టం. ఆయన రాకుంటే రాజకీయ భవిష్యత్తును సమాజమే నిర్ణయిస్తుంది. శివప్రసాద్ రెడ్డి వచ్చినా రాకపోయినా నేను మాత్రం అవినీతి చేయలేదని దేవుడి ముందు నా నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

Related posts

మే 7 వరకు ఎలాంటి సడలింపులు లేవు

Satyam NEWS

ఇద్దరు పాత నేరస్తుల దారుణ హత్య

Satyam NEWS

బస్తీల పరిశుభ్రతకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!