28.7 C
Hyderabad
April 24, 2024 06: 29 AM
Slider సంపాదకీయం

జగన్, కేసీఆర్ లపై విల్లంబు ఎక్కుపెట్టిన కమలనాథులు

#BJP Top leaders

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము చౌకగా ఇస్తున్న విద్యుత్ ను అధిక ధరలకు అమ్ముకుంటున్నదని సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఆరోపించి అక్కడి అధికార వైసీపీతో పంచాయితీ పెట్టారు.

అది గడిచి రెండు రోజులు కూడా కాకముందే బిజెపిలో అత్యంత కీలకమైన నాయకుడు, బిజెపి ట్రబుల్ షూటర్ అయిన రామ్ మాధవ్ తెలంగాణ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

బిజెపి విమర్శపై అధికారులతో క్లారిఫికేషన్ ఎందుకు?

ఆంధ్రాలో వైసీపీతో చాలా విషయాల్లో అంటకాగుతున్న బిజెపి నుంచి అంత కఠినమైన వ్యాఖ్యలు రావడంతో ఒక్క సారిగా రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. వైసీపీ కూడా కంగారుపడింది. అయితే రాజకీయ నాయకులతో కాకుండా అధికారులతో కేంద్ర ఆర్ధిక మంత్రికి సమాధానం ఇచ్చి చాకచక్యంగా బిజెపితో రాజకీయ విభేదాన్ని చల్లబరిచేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించుకున్నారు.

అధికారులతో సమాధానం చెప్పించడం ద్వారా తాను బిజెపితో పోరాటం చేసే మూడ్ లో లేనని బిజెపికి పరోక్షంగా సందేశం పంపారు. దానికి బిజెపి అంగీకరిస్తుందా లేదా అనేది మరి కొద్ది కాలంలో తేలుతుంది. ఈ లోపు తెలంగాణ లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఒంటికాలిపై లేచింది.

రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చిన నాటి నుంచి బిజెపి దూకుడు వ్యవహారమే తెలంగాణలో నడుపుతున్నది. పార్టీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన దైన శైలిలో పలు అంశాలపై రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ తో పోరాటం జరుపుతున్నారు. బండి సంజయ్ కి విషయ పరిజ్ఞానం లేదని టీఆర్ఎస్ పలు సందర్భాలలో ఆయన పరువు తీసే విధంగా వ్యాఖ్యానించింది. బండి సంజయ్ ని కించపరిచే విధంగా టీఆర్ఎస్ ప్రవర్తించింది.

తెలంగాణ లో పోరాటానికి కమలనాథులు సిద్ధం

అయినా ఆయన మాత్రం టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీ మధ్య రాజకీయ అవగాహన ఉందని ఆయన తరచూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సీఆర్‌ కార్యకలాపాలకు త్వరలో ముగింపు తప్పదని రామ్ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ తీవ్రంగా ప్రయత్నించారని అయితే హైదరాబాద్‌లో ఆయన ఇప్పుడు ఒంటరిగా, ఏకాకిగా కూర్చున్నారని రామ్ మాధవ్ అన్నారు.

అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ప్రజల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం జన్‌సంవాద్‌ ప్రాంతీయ వర్చువల్‌ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంమాధవ్‌ ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లా పార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగించారు. ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అన్నదానికి ఉదాహరణ కేసీఆర్‌ సర్కారేనని ఆయన అన్నారు.

ఆరేళ్లలో ఏం సాధించారు?

సగం సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప, ఏడాది కాలంలో కేసీఆర్ సాధించింది ఏదీ లేదని రామ్ మాధవ్ విమర్శించారు. రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి కాదని, ఒక వ్యూహం ప్రకారం చేసినవేనని బిజెపి నాయకులు అంటున్నారు. రాష్ట్ర పార్టీ మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి మరింత సాయం అందుతుందని తెలంగాణ బిజెపి లెక్కలు వేసుకుంటున్నది.

Related posts

బిచ్కుంద సీఐ ఎస్సైలను కలిసిన బీఎస్పీ దండోరా నాయకులు

Satyam NEWS

11వ రోజు ఆహారం అందించిన మై వేములవాడ వాట్సప్ గ్రూప్

Satyam NEWS

ఉంగలం తిరుమల్ ఆధ్వర్యంలో 33వ వార్డు ప్రజల సందర్శన

Satyam NEWS

Leave a Comment