తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో పర్యాటక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరు సురక్షితంగా బయటపడినా మరో 37 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ పడవలో సిబ్బందితో కలిసి 61 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 27 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అదే విధంగా లైఫ్ జాకెట్ లు వేసుకున్న వారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారి జాడ తెలియడం లేదు. వీరంతా గండిపోచమ్మ నుంచి పాపికొండలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించినట్లు తెలుస్తోంది. గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. పడవ ప్రమాద ఘటనపై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరా తీశారు. జిల్లా ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారులతో ఫోన్ చేసి ఘటనకు సంభందించిన విషయాలు అడిగితెలుసుకున్నారు. పర్యాటకులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హుటాహుటిన సంఘటనా స్ధలానికి బయలుదేరి వెళ్లారు. వరద ఉధృతి ఉండగా బోటుకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారనేది ఇప్పుడు వివాదాస్పదం అయింది.
previous post
next post