హై ప్రోటీన్ డైట్… ఏసీ రూంలో వర్కవుట్లు… ఇంటర్నేషనల్ ట్రైనర్స్.. ఇవేవీ లేవు అయినా బాడీ బిల్డింగ్ లో బంగారు పతకాలు సాధిస్తున్న ఘనుడు అతడు. ఇప్పటి వరకు పదిసార్లు మిస్టర్ ఆంధ్రా టైటిల్ కొట్టాడు. అంతేనా? అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. గుంటూరు జిల్లా రూరల్ మండలం ఏటుకూరుకు చెందిన రవికుమార్ కథ ఇది. తండ్రి లారీ డ్రైవర్, తల్లి టిఫిన్ సెంటర్ నడుపుతోంది. కడుపేదరికంలో ఉన్నా కూడా బంగారు పతకాలు సాధిస్తున్నాడు రవికుమార్. ఈ నెల 3వ తేదిన ఇండోనేషియా లో జరిగిన ఏషియన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఇప్పటి వరకు పదిసార్లు మిస్టర్ ఆంధ్రా టైటిల్, ఒక్కసారి ఆలిండియా బాడీబిల్డింగ్ బంగారు పతకం సాధించాడు. వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ కు కూడా ఎంపికయ్యాడు. దేవుడిచ్చిన బాడీని ఉక్కు కండరాలుగా మార్చుకున్నాడు. బంగారు పతకాలు సాధిస్తున్నాడు కానీ పేదరికాన్ని మాత్రం జయించలేకపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై బాడీ బిల్డింగ్ చేయాలి. అయితే ఎలా? తినడానికి తిండేలేని కుటుంబం నుంచి వచ్చిన రవికుమార్ ఇప్పుడు మరొక్క మెట్టు ఎక్కాలన్నా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తేవాలన్నా ఇప్పుడు కావాల్సింది సాయం. ఆర్ధిక సాయం. ఎవరు ఇస్తారు? అదే ఇప్పటి ప్రశ్న. ఇన్ని ఘనతలు సాధించిన రవికుమార్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. ఇటీవల బంగారు పతకం గెలిచి వచ్చాక కనీసం పూలబొకే ఇచ్చిన వారు కూడా లేరు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు. రవికుమార్ కు స్పాన్సరర్స్ కావాలి. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి స్పాన్సర్ షిప్ ఇస్తారేమోనని రవికుమార్ ఎదురు చూస్తున్నాడు. అతని లక్ష్యం నెరవేరేందుకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు సాయం చేయాలి. రవికుమార్ వేచి ఉన్నాడు.
previous post