అత్యంత రహస్యంగా జీవోలు విడుదల చేయడం అలవాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అదే గుదిబండగా మారింది. సాధారణంగా అయితే ప్రభుత్వ ఆదేశాలు (జీవో) బహిరంగంగా ఉండాలి. పరిపాలనా సంస్కరణలలో భాగంగా జీవోలను ఆన్ లైన్ లో ఉంచే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఏ జీవోను విడుదల చేసినా అది ఆన్ లైన్ లో ఉంటుంది. దాదాపుగా అన్ని జీవోలూ ప్రజల సౌకర్యార్ధం విడుదల చేసేవే కాబట్టి ప్రజలకు చెప్పడంలో ఎలాంటి నష్టం ఉండదు.
అయితే కొన్ని సర్వీసు మేటర్స్ లోనూ మరి కొన్ని విషయాలలోనూ కొంత మేరకు గోప్యత పాటించేందుకు కొన్ని జీవో లను ఆన్ లైన్ లో ఉంచరు. వాటిని కాన్ఫిడెన్షియల్ అని పెట్టి ఉంచుతారు. అయితే అదేమిటో గానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రహస్య జీవోల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ కాన్ఫిడెన్షియల్ జీవోల క్యాటగిరిలోకి రాని జీవో లను కూడా ఆన్ లైన్ లో ఉంచకుండా ప్రభుత్వం గోప్యత పాటించింది.
ఈ అవకాశాన్ని కొందరు స్వార్థపరులు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో పెద్దల ఆశీస్సులతో తిష్ట వేసుకుని ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ కొందరు ఈ వ్యవహారం మొత్తాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని తమకు ముడుపులు ఇచ్చిన వారికి జీవోలు తెప్పించి రహస్యంగా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కీలక శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఓఎస్ డిలుగా తిరిగి అప్పాయింట్ మెంట్ పొంది ఇలాంటి పనులు చేస్తున్నారు.
జీఏడిలో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఓఎస్ డిగా చేరి రోజుకు దాదాపుగా లక్ష రూపాయల ముడుపులు సంపాదించుకుంటున్నారు. అదే విధంగా ఆర్ధిక శాఖలో ఒక ఉద్యోగి ఏకంగా సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తానని ఇంటర్వ్యూలు కూడా చేశాడు. ఇలాంటి కార్యక్రమాలపై నిఘా లేకుండా పోవడం, వెలికి వచ్చినా తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం శృతి మించి నకిలీ జీవో లను తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది.
సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినట్లు లేఖలు సృష్టించడం ఇప్పుడు పెద్ద బెడదగా మారింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి రాసినట్లు లేఖ ను సృష్టించిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు. నీటిపారుదల శాఖలో ఇటీవలె నకిలీ జీవో విషయాన్ని సత్యం న్యూస్ వెలికి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక కాంట్రాక్టర్ తన అపరాధ రుసుం మాఫీ అయినట్లు జీవో సృష్టించుకున్నాడు.
ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కాక చేష్టలుడికి కూర్చున్నది. ఇఎస్ఐ కుంభకోణం విషయం వెల్లడైన నాటి నుంచి ప్రభుత్వానికి నకిలీ జీవోలు, నకిలీ డివో లెటర్లు తో బాటు వర్క్ ఆర్డర్ల విషయం కూడా శిరోభారంగా మారింది. ఇఎస్ఐ కార్పొరేషన్ లోగత ఐదేళ్లలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల మేరకు మందులు కొనుగోలు చేశారు.
ఇదంతా మందులు కొనుగోలు చేయకుండా చేసినట్లు చూపించి గోల్ మాల్ చేసిందే. దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇటీవల వెలికివచ్చాయి. ఇలాంటి చర్యలన్నీ ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. దీనికి ప్రధానంగా ప్రభుత్వం రహస్యంగా జీవోలు జారీ చేయడం నుంచే ప్రారంభం అయిందని అంటున్నారు. జూన్ 2వతేదీ, 2014 నుండి ఆగష్టు 15వ తేదీ, 2019 మధ్యన సుమారు 1.04 లక్షల జీఓలు జారీ అయ్యాయి. ఇందులో 43,462 జీఓలు రహస్య జీవోల క్యాటగిరిలో ఉన్నాయి.
ఇంత గోప్యంగా పాలన జరగడంతో ఇప్పుడు పుట్టుకు వస్తున్న జీవోలు నకిలీ జీవోలా? రహస్య జీవోలా అనే విషయం ఎవరికి అర్ధం కావడం లేదు. రహస్య జీవోలు లెక్కు మించి ఉండటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనేది నిస్సందేహంగా నిజం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ ఆన్ లైన్ లో పెట్టే విధానం పాటిస్తే నకిలీ జీవోలు వచ్చే అవకాశం ఉండదు కానీ ప్రభుత్వం ఆ పని చేయడంలేదు. ఈ కారణంగా ప్రభుత్వ సర్వీసుల్లో ఓఎస్ డిలుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులు తమ తెలివి తేటలు ఉపయోగించి నకిలీ జీవోలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే చాలా శాఖ ల్లో ఇలాంటి జీవోలు అమలు జరిగి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పట్టుబడినవే పదుల సంఖ్యలో ఉంటే ఇక పట్టుపడని నకిలీ జీవోలు ఎన్ని ఉంటాయోననే అనుమానం పట్టిపీడిస్తున్నది