ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం అయినా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే బస్టాండుల్లో కరెంట్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో బస్సులు రోడ్డెక్కాయి.
గురువారం ఉదయం నుంచి బస్టాండుల్లో ప్రయాణికుల సందడి కనిపించింది. లాక్‌డౌన్‌కు ముందు వేరే జిల్లాల్లో చిక్కుకుపోయిన వారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. బస్సులు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ కొన్ని నిబంధనలతో పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇంతకీ ఈ బస్సులకు టికెట్‌లు ఎలా బుక్ చేసుకోవాలి.. బస్సుల్లో టికెట్లు ఇస్తారా లేదా వంటి అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలి. అదేవిధంగా బస్టాండుల్లో కరెంట్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే https://www.apsrtconline.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
వెబ్‌సైట్‌తో పాటు APSRTC మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ దొరకని పక్షంలో ఆర్టీసీ బస్టాండ్‌లు, బుకింగ్ సెంటర్లలో చేసుకోవచ్చు. ఇలా టికెట్లు తీసుకునే వారు నగదు రహితంగా లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. మాస్కులు ధరించిన ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తారు.
చేతులు శుభ్రం చేసుకోవాలి. డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలి. డిపో నుంచి డిపోకు మాత్రమే బస్సులు నడుస్తాయి. మధ్యలో ఎక్కడా ఆపరు. ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. దూర ప్రాంతాలకు రాత్రిళ్లు సర్వీసులు నడుస్తాయి.
బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ సీట్లలో మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 56 సీట్లకు బదులు 35.. ఎక్స్‌ప్రెస్ 30కి 20 సీట్లు.. అల్ట్రా డీలక్స్‌లో 40కి బదులుగా 29.. సూపర్ డీలక్స్ 36కి బదులు 26 సీట్లు ఉంటాయి.