27.2 C
Hyderabad
October 21, 2020 18: 42 PM
Slider ఆధ్యాత్మికం

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

#TirumalaBalajee

తెలుగువారి ఇలవేలుపు  తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. వేంకటేశుని సన్నిధిలో ప్రతిరోజూ వేడుకే. ఆది నుండీ, శ్రీ వేంకటేశ్వరునికి నిత్యకల్యాణము పచ్చతోరణమే. బ్రహ్మోత్సవాలకు విభిన్నమైన అర్ధాలు చెబుతారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలయ్యాయని కొందరు అంటారు.

తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను నవబ్రహ్మలలోని   ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు జరిపిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని మరో అర్ధంలో మరికొందరు భావిస్తున్నారు. పరబ్రహ్మస్వరూపుడైన వేంకటేశ్వరునికి జరిపే వేడుకగా భావించి బ్రహ్మోత్సవాలుగా కొందరు అభివర్ణిస్తారు.

రమణీయంగా, కమనీయంగా

బ్రహ్మాండనాయకుడిని తలుస్తూ, కొలుస్తూ బ్రహ్మాండంగా చేసే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని,  మరి కొందరు భావిస్తారు. “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు…. ” అని అన్నమయ్య అన్నట్లుగా,  ఏ రీతిన కొలిచినా ఇవి బ్రహ్మోత్సవాలే. శ్రీవారికి జరిపే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు రమణీయంగా, కమనీయంగా జరుగుతాయి.

ఏ ఏడాది అయినా అధిక మాసం వస్తే బ్రహ్మోత్సవాలు రెండు సార్లు నిర్వహిస్తారు. అవే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు జరుగుతున్నవి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వీటి తర్వాత నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

ఈ సారి ఏకాంతంలోనే బ్రహ్మోత్సవాలు

ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ సృష్టించిన కష్టాలు, నిబంధనల వల్ల బ్రహ్మోత్సవం ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది కరోనా వైరస్ సోకి బాధపడుతున్నారని విన్నాం.

ఈ నేపథ్యంలో అందరి మేలుకోరి ఈ సంవత్సరం ఇలా ఏకాంతంగా జరుపుతున్నారు. బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సునే కోరుకుంటాడు. వచ్చే సంవత్సరం రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవచ్చు.

అప్పటికి కరోనా వైరస్ నూటికి నూరు శాతం కట్టడిలోకి వస్తుందని విశ్వసిద్దాం. శ్రీ విష్వక్సేనుడి వద్ద తొలి రోజు పూజలు జరిపి అంకురార్పణ చేశారు. వేద పండితుల దివ్య వేద ఘోష మధ్య, వేంకటనాయకుని వేడుక  శుభారంభమైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.

గరుడ సేవకు సిఎం జగన్ హాజరు

శనివారం నాడు ధ్వజారోహణంతో మొదలైన ఈ సంబరాలు చక్రస్నానంతో ముగుస్తాయి. 19వ తేదీ న ప్రారంభమై 27వ తేదీ వరకూ 9 రోజులపాటు జరుగుతాయి. గరుడసేవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

సుందరకాండ పారాయణం కూడా విశేషంగా జరుగనుంది. ఇందులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అంకురార్పణకు ఒక విశిష్టత వుంది. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ,ముద్గ, మాష, ప్రియంగ మొదలైన నవధాన్యాలను పోసి పూజిస్తారు.

ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్ధనలు జరుపుతారు. అందుకే, ఈ ఉత్సవాలు శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్న కుండలాలను నిర్మిస్తారు. తరువాత, పూర్ణకుంభ ప్రతిష్ఠ చేస్తారు.

చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు

పాళికలలో  వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోస్తారు. అవి పచ్చగా మొలకెత్తుతాయి. అంకురాలను  ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు. మొదటి రోజు ధ్వజారోహణం, రెండవరోజు శేషవాహనం, మూడవరోజు సింహవాహనం, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, ఐదవ రోజు మోహినీ అవతారం,

గరుడవాహనం, ఆరవరోజు గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, ఎనిమదవ రోజు రధోత్సవం, తొమ్మిదవ రోజు చక్రస్నానం జరుగుతాయి. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత, సాయంకాలం శ్రీవారి ఆలయ ధ్వజస్థంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. అంటే దించుతారు.

ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికినట్లే. దీనితో బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా పరిపూర్ణమైనట్లు భావిస్తారు. మళ్ళీ ఇదే కాలంలో సంవత్సరం తర్వాత మళ్ళీ బ్రహోత్సవాలు జరుపుతారు. ఇలా ప్రతి ఏటా వేంకటేశ్వరునికి విశేషరీతిలో వేడుకలు జరపడం కొన్ని వందల సంవత్సరాల నుండీ ఆనవాయితీ.

ఏనాడూ ఈ ఉత్సవాలు ఆగలేదు. ఆగవు కూడా. “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్నట్లు ఇంతటి బ్రహ్మోత్సవాలు ఎక్కడా  జరుగవు, ఒక్క వేంకటేశ్వరునికి తప్ప. ఉమ్మడి మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు దక్కిన గొప్ప క్షేత్రం తిరుమల.

ఇది క్షేత్రరాజం. నిత్య పూజనీయ స్థలం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి రెట్టింపు ఉత్సాహంతో బ్రహోత్సవాలు జరగాలని కోరుకుందాం. జరుగుతాయని విశ్వసిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

మోటారు మెకానిక్ లకు వివిసి మోటార్స్ బియ్యం పంపిణీ

Satyam NEWS

ప్రతి పల్లెలో ఆగే ఎక్స్ ప్రెస్ బస్సులను ఎక్కడైనా చూశారా?

Satyam NEWS

కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్పకు కరోనా

Satyam NEWS

Leave a Comment