స్నేహ బంధాన్ని కాదన్నందుకు ఒకడు మహిళా లెక్చరర్ పై పెట్రోలు పోసిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె నేడు మరణించింది. ఈ అమానవీయ సంఘటన ఈ నెల 3వ తేదీ మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలో జరిగింది. రెండు సంవత్సరాలుగా ఆమె అతని ప్రవర్తనతో విసిగిపోయి దూరంగా ఉంటున్నది. దీన్ని భరించలేకపోయిన వికేష్ నగర్రే (27) అనే వాడు ఆమెపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు.
దాంతో 25 ఏళ్ల మహిళ లెక్చరర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వార్ధా లోని హింగంగాత్ పట్టణానికి చెందిన అంకితా పిసుడే కు జరిగిన దురదృష్టకర సంఘటన ఇది. ఆమె ఆ కిరాతకుడి చర్యకు తీవ్రమైన కాలిన గాయాలపాలైంది. వార్ధా నుండి సుమారు 75 కి. మీ దూరంలో ఉన్న ఆరెంజ్ సిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఆమె చికిత్స చేయించుకుంది.
అయితే ఆమె చికిత్సకు స్పందించలేదని హింగోంగత్ పోలీస్ ఇన్ స్పెక్టర్ సత్యవీర్ బన్దివార్ తెలిపారు. ఆమె తలపై లోతైన కాలిన గాయాలు, ముఖం, కుడి ఎగువ అవయవం, ఎడమ చేయి, ఎగువ వీపు, మెడ, కళ్లు తీవ్రమైన గాయాలు అయ్యాయి. శ్వాస కూడా పీల్చలేని నిస్సహాయ స్థితికి ఆమె చేరుకుంది. చివరకు ఆమె “సెప్టిమిక్ షాక్” తో మరణించింది. మహిళ తల్లిదండ్రులు, మామ క్షీణిస్తున్న ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తీవ్రంగా తల్లడిల్లారు.
ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, ఇతర లాంఛనాల కోసం పోలీసులకు అప్పగించామని ఆస్పత్రి తెలిపింది. ఆమె మరణించిన విషయాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్, వార్ధా గార్డియన్ మంత్రి సునీల్ కేదార్, నాగపూర్ డివిజనల్ కమీషనర్ సంజీవ్ కుమార్, పోలీస్ కమీషనర్ భూషణ్ కుమార్ లకు తెలియజేశారు.
ఆమె మరణం పై ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు హింగంగాఘాట్ లో భారీ భద్రతను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పలువురు స్థానికులు, ఎక్కువగా మహిళలు, కళాశాల విద్యార్థులు వార్ధా నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సుప్రసిద్ధ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను ప్రభుత్వం నియమించింది. ఉజ్వల్ నికమ్ వాదిస్తే వాడికి ఉరి ఖాయం అనే పేరు ఉంది.