గత కొద్ది సంవత్సరాలుగా దారుణమైన నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ జియో ఫైబర్ రాకతో పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. జియో మొబైల్ సేవలు రావడంతోనే బిఎస్ఎన్ఎల్ లాభాలు గణనీయంగా తగ్గి నష్టల్లోకి వెళ్లింది. మూడేళ్ల కిందట నుంచి రోజు రోజుకు దిగజారుతున్న బిఎస్ఎన్ఎల్ ను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. పైగా బిఎస్ఎన్ఎల్ ను సర్వనాశనం చేసే శక్తి ఉన్న జియో ఫైబర్ కు అన్ని రకాల అనుమతులు క్షణాలలో వచ్చేస్తున్నాయి. మార్కెట్ ను ఆక్రమించేందుకు సెప్టెంబర్ 5 నుంచి వచ్చేస్తున్న జియో ఫైబర్ తొలి ఏడాదిలో దాదాపు 1600 పట్టణాలలో రెండు కోట్ల గృహాలకు 1.5 కోట్ల వ్యాపార సంస్థలకు సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నది. డేటా, టెలిఫోన్, టివి అన్నీ ఒకే వైర్ ద్వారా ఇచ్చేందుకు సిద్ధపడిన జియో ప్రధాన టార్గెట్ బిఎస్ఎన్ఎల్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్లు తీసుకునేవారు కరవయ్యారు. మొబైల్ ఫోన్లు ఒక్కొక్కటిగా మైగ్రేట్ అవుతున్నాయి. ఈ దశలో కూడా పూర్తి స్థాయిలో 4జి సేవలను బిఎస్ఎన్ఎల్ వినియోగంలోకి తీసుకురాలేకపోయింది. రోజు రోజుకూ చతికలపడిపోతున్న బిఎస్ఎన్ఎల్ ను ఉద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కనీస సాయం కూడా చేయడం లేదు సరికదా జియో లాంటి ప్రయివేటు ఆపరేటర్లకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ రూ.14,000 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకున్నది. మొత్తం ఆదాయం రూ.19,308 కోట్లు దాటలేదు. దాదాపు 75 శాతం సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు అయిపోతుండటంతో విస్తరణకు నోచుకోవడం లేదు. దానికి తోడు ప్రయివేటు కాంపిటీషన్ ను తట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభించడం లేదు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ.4,859 కోట్ల మేరకు నష్టం తెచ్చుకున్న బిఎస్ఎన్ఎల్ 2016-17లో రూ.4,793 కోట్లు, 2017-18లో రూ.7,993 కోట్లు నష్టాలను చవిచూసింది. 2016లో జియో 4జి రావడంతోనే ఒక్క సారిగా బిఎస్ఎన్ఎల్ కుదేలైపోయింది. 2016-17 లో రూ.31,533 కోట్ల ఆదాయం పడిపోయి రూ.19,308 కోట్లకు వచ్చింది. ప్రభుత్వానికి అవసరం వచ్చినపుడు ఆదుకునేది బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అంటే ఏదైనా ప్రకృతి వైపరిత్యం సంభవించినపుడు బిఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తుంది తప్ప ప్రయివేటు ఆపరేటర్లు కాదు. అదే విధంగా వాణిజ్యపరంగా ఎలాంటి లాభాలు రాని కొండ ప్రాంతాలలో కూడా బిఎస్ఎన్ఎల్ మాత్రమే సేవలు అందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటికి బిఎస్ఎన్ఎల్ ఒక్కటే సేవలు అందిస్తుంటుంది. ఇలాంటి సంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోగా జియో లాంటి సంస్థలకు అత్యంత ఎక్కువ ప్రోత్సాహం దక్కుతున్నది. బిఎస్ఎన్ఎల్ ను పునరుద్ధరించేందుకు అహ్మదాబాద్ ఐఐఎం, డెలాయిట్ కంపెనీలు కలిసి ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాయి కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం లేదు. పాలకులే జియోను చూసి మురిసిపోతుంటే ఇక బిఎస్ఎన్ఎల్ తన గోడును ఎవరితో చెప్పుకోవాలి?
previous post