22.2 C
Hyderabad
December 10, 2024 10: 54 AM
Slider సంపాదకీయం

హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

#Buggana Rajendranath Reddy

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే… సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే… ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే బడ్జెట్ ను మంత్రి కొలుసు పార్థసారథి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పయ్యావుల తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ఇక ముందుగా ప్రకటించిన మేరకు… అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదంటూ అలిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అయితే శాసనమండలికి మాత్రం ఆయన తన పార్టీ ఎమ్మెల్సీలను పంపించడం గమనార్హం. జగన్ రెండు నాల్కల ధోరణిని బహిరంగంగానే చూపెట్టినా… అధికార కూటమి సర్కారు యధావిధిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇక సభలో పయ్యావుల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిస్పందించేందుకు జగన్ జమానాలో ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాస్తంత ఆలస్యంగా సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు.

వచ్చీరావడంతోనే కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే అమలు చేస్తున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి కేవలం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పిన  పయ్యావుల.. తన ప్రసంగంలో ఆ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారని తప్పుబట్టారు. ఇక ప్రభుత్వ ఆదాయ మార్గాలన్నీ తిరోగమన బాట పట్టాయని బుగ్గన అన్నారు.

తమ హయాంలో సర్కారీ ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఓ వైపు సర్కారీ ఆదాయా మార్గాలు తగ్గిపోతున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలకు గానీ, ఇతరత్రా సర్కారీ వ్యవహారాలకు గానీ నిధులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ఈ విషయంలో పయ్యావుల నేల విడిచి సాము చేశారని ఆయన ఆరోపించారు. ఓ వైపున ఆదాయం లేదని చెబుతూనే మరోవైపున ఆయా శాఖల వద్ద నిండుగా నిధులున్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ఇలా అన్ని విషయాలను పొంతన లేకుండా చెప్పడానికే పయ్యావుల సిద్ధపడిపోయారన్నారు. అంటే… జనాన్ని నమ్మించేందుకు పయ్యావుల అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన ఆరోపించారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇస్తే…ఇప్పుడు అవే పార్టీలతో కూడిన కూటమి సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు అబద్ధాలను చెబుతూ సాగుతోందని ఆయన ఆరోపించారు. మొత్తం కూటమి సర్కారు అబద్ధాల ప్రభుత్వంగా ఘన కీర్తి తెచ్చుకుంటుందని కూడా బుగ్గన శాపనార్ధాలు పెట్టారు.

కూటమి పార్టీలు ఎన్నికల్లో అమలు చేయడానికి వీలు కాని హామీలను ఇస్తే వాటిని ప్రజలు నమ్మారని బుగ్గన అన్నారు. ఇప్పుడు అవే హామీలను అమలు చేయకున్నా కూడా అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తున్నా ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో కూటమి పార్టీలతో పాటు ఆ పార్టీల ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను సాక్ష్యాలతో సహా వైసీపీ బయటపెడుతోందని బుగ్గన చెప్పారు. కూటమి సర్కారు అబద్ధాలను పక్కా ఆధారాలతో బయటపెడుతున్న వైసీపీ మాటలను ప్రజలు మాత్రం నమ్మడం లేదని బుగ్గన వాపోయారు.

అబద్ధాలు చెప్పే కూటమి పార్టీలను నమ్ముతున్న జనం… నిజాలు చెప్పే తమను నమ్మడం లేదని నిష్టూరమాడారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే… వైసీపీని నమ్మని కారణంగానే జనం ఆ పార్టీకి గూబ గుయ్యిమనేలాంటి తీర్పు ఇచ్చి 11 సీట్లకే పరిమితం చేశారు కదా అంటూ సెటైర్లు పడిపోయాయి.

Related posts

పేదవారికి కూడా రుణాలు అందేలా చేసిన ఇందిరమ్మ

Satyam NEWS

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

Satyam NEWS

అంబటికి చెక్: సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ?

Satyam NEWS

Leave a Comment