తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూలగొట్టుడు ప్రక్రియ ప్రారంభం అయినట్లే కనిపిస్తున్నది. పటిష్టమైన భవనాలతో, పచ్చని చెట్లతో ఉన్న సచివాలయం ప్రాంగణంలో ఇక అన్నీ మాయమై దుమ్ము, సిమెంటు థూళి స్వైర విహారం చేయనున్నాయి. సచివాలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు అడుగు పెట్టేశాయి. అత్యంత పటిష్టంగా ఉన్న సచివాలయ భవనాలను కూల్చడం అంత తేలిక కాదు. సచివాలయ భవనాలకు మరో వందేళ్ల జీవిత కాలం ఉందనగానే వాస్తు కారణాలతో పడగొడుతున్నందున అధునాతన యంత్ర పరికరాలను వినియోగించాల్సి ఉంటుంది. అలా అయితే తప్ప భవనాలు పడగొట్టడం సాధ్యం కాదు. అందుకోసమే అధునాతన యత్రాలను తెప్పిస్తున్నారు. సచివాలయం పడగొట్టడానికే కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. భవన శిధిలాలను ఎత్తి పోయడానికి రాత్రిబగళ్లు పని చేస్తే కనీసం నెల నుంచి రెండు నెలలు పడుతుంది. సచివాలయం పడగొట్ట వద్దని ఎంత మంది మొత్తుకున్నా తెలంగాణ ప్రభుత్వం వినిలేదు. పటిష్టమైన భవనాలు ఎందుకు కూలగొడతారు అలా చేయవద్దు. మీకు ఇష్టం లేకపోతే సచివాలయ భవనాలలో అధునాతనమైన ఆసుపత్రి పెట్టి దానికి కేసీఆర్ ప్రజావైద్య శాల అని పేరు పెట్టుకోమని కూడా సత్యం న్యూస్ సూచించింది. అన్నిబ్లాకుల్లో మొదటి రెండు అంతస్థులు ఎమర్జెన్సీ, అవుట్ పేషట్ల విభాగాలుగా వాడుకుని, ఆ తర్వాత ఆపరేషన్ ధియేటర్లు, ఆ పైన పేషంట్ రూంలుగా వాడుకోవచ్చు. పెద్ద పెద్ద లిఫ్టులు ఉండటం వల్ల ప్రతి భవనంలో కూడా స్ట్రెచర్ ల పై రోగులను సులభంగా తీసుకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. సచివాలయం అవుటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలోకి ఉదాహరణకు మేడ్చల్ వైపు లేదా గచ్చిబౌలి వైపు తరలించి అక్కడ అధునాతన భవనాలు నిర్మించుకుంటే ఇంకో వందేళ్ల అవసరాలు తీరతాయి. అయినా ఇవేవీ చేయలేదు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రస్తుత సచివాలయం ప్రాంగణంలోనే ఉన్న భవనాలు కూల్చడం పర్యావరణానికి కూడా మంచిది కాని చెప్పినా వినలేదు. ప్రస్తుతం 400 కోట్ల రూపాయల అంచనా వ్యయం అని చెబుతున్నా, సచివాలయం పూర్తి అయ్యే నాటికి అది వెయ్యి కోట్లకు చేరుతుంది. ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. చివరికి వాస్తు గెలిచింది. వాస్తు మూఢ నమ్మకం కాదు. తెలంగాణ రాజ్యాంగంలో ఒక భాగం. ఇక ఇది ఇంతే.
previous post