దసరా పండుగ నాటికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశించే వారికి నిరాశ తప్పదని విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని మార్పులు చేర్పులతో దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వద్ద ప్రస్తుతం ఎంతో కీలక శాఖలు ఉండిపోయాయి. ముఖ్యంగా నీటిపారుదల, ఫైనాన్స్, రెవెన్యూ, కమర్షియల్ టాక్స్ లను మంత్రి లేకుండా ముఖ్యమంత్రే స్వయంగా నిర్వహించడం ఎంతో కష్ట సాధ్యమైన విషయం అయితే అంతటి కష్టమైన పనిని సిఎం కేసీఆర్ ఇంత కాలం చేస్తూ వస్తున్నారు. ఈ పెద్ద శాఖలను సమర్ధులైన వారికి ఇవ్వాలని ఆయన గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం దసరా పండుగను ముహూర్తంగా పెట్టుకున్నారు. దసరా పండుగ ముందులేదా అయిపోయిన వెంటనే ముహూర్తం కోసం ఆయన ప్రయత్నం చేశారు. ముందుగా ఆయన అనుకున్నదాని ప్రకారం మంత్రి వర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లను తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా కేటీఆర్, హరీష్ లను కూడా తీసుకోవాలని భావించారు. ఈ నలుగురిని తీసుకోవాలంటే కనీసం ఇద్దరిని మంత్రి వర్గం నుంచి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆయన వేసుకున్న అంచనాల మేరకు పనితీరు కనబరచలేకపోయిన మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి లను పక్కన పెట్టేందుకు ఒక దశలో ఆయన ఆలోచించారు. అయితే ఈ ఆలోచనలన్నీ కార్యరూపంలోకి రావడానికి దసరా కాకుండా మరింత సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. క్యాష్ ఫ్లో ఆశించినంతగా ఉండటం లేదు. దాంతో రోజూ వారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఈ దశను దాటాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేసుకున్న ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాజా పరిస్థితి ప్రకారం మార్చిలో కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందుగానీ వెనువెంటనే గానీ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని అనిపిస్తున్నది.