33.2 C
Hyderabad
April 26, 2024 00: 51 AM
Slider ప్రత్యేకం

ఆ ముగ్గురికి సీట్లు గల్లంతేనా…..?

ఒక మంత్రి, ఇద్దరు తాజా మాజీ మంత్రులకు సీట్లు గల్లంతేనా అనే చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతున్నది. తాజాగా వైసీపీ జిల్లా అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చింది. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, తాజా మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌లను ప్రాంతీయ సమన్వయ కర్తల బాధ్యతల నుంచి తొలగించారు. వీరిలో సజ్జల రామకృష్ణారెడ్డి అసెంబ్లీకి గానీ, పార్లమెంటుకు గానీ పోటీ చేసే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్ధిగా గెలిచి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నానిని, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ లను కూడా ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యత నుంచి తీసేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ నిరాకరిస్తున్నారనేదానికి ఇది సంకేతమా అనే చర్చ జరుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయనని తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే కోరారు. అయితే రాజకీయ వారసులను తీసుకువచ్చే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు.

దాంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. అంతే కాకుండా బుగ్గన ఈ సారి పోటీ చేయను అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు పూర్తి వ్యతిరేకత ఉంది. అక్కడి పార్టీ నేతలు వర్గ పోరాటంలో తలమునకలై ఉన్నారు. దాంతో ఆయన గెలుపునకు సహకరించేవారే లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడికి సీటు అడుగుతున్నారని అయితే అందుకు అధిష్టానం అనుకూలంగా స్పందించకపోగా తాజాగా ఆయన పార్టీ పదవిని కూడా తీసేసింది. దాంతో వచ్చే ఎన్నికలలో బుగ్గనకు వైసీపీ టిక్కెట్ రాదని కచ్చితంగా తేల్చేసినట్లు అవుతున్నదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ పైనా, చంద్రబాబునాయుడిపైనా అత్యంత దారుణమైన విమర్శలు చేసే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంత కాలం జగన్ కు అత్యంత విధేయుడు అనుకున్నారు. అయితే అలాంటి కొడాలి నానికి కూడా పార్టీ పదవి పోయింది.

దాంతో ఆయనకు కూడా ఈ సారి టిక్కెట్ రావడం కష్టమేనని అంటున్నారు. పైగా ఆయనకు ఇటీవల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా ఆయన పూర్తి స్థాయి శ్రద్ధను నియోజకవర్గంలో చూపలేరని వైసీపీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ పదవి పోగా, ఈ సారి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాదనే ప్రచారం బాగా జరుగుతున్నది. నెల్లూరు జిల్లాలో ప్రముఖ నాయకులను శత్రువులుగా తయారు చేసుకున్న అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయిన నాటి నుంచి ముభావంగా ఉంటున్నారు. నెల్లూరు జిల్లా ప్రముఖ నాయకులు ఎవరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల పార్టీ పదవి పోగొట్టుకున్న అనిల్ కుమార్ యాదవ్ కు ఈ సారి పార్టీ టిక్కెట్ కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

Related posts

శ్రీరామనవమి ఘనంగా జరిగేలా ఏర్పాట్లు

Bhavani

నాడు మద్దతు.. నేడు దూరం: కామారెడ్డి బల్దియా పీఠం హస్తగతం

Satyam NEWS

20 న విజయనగరం అయోధ్య మైదానంలో “హిందూ శంఖారావం..”

Bhavani

Leave a Comment