విశాఖ పట్నం కు చెందిన వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాను పదవిలో ఉండగా చేసిన పాల్పడ్డ అక్రమాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎంపీ పదవిలో ఉండగా ఎంవీవీ అనేక భూదందాలు, ఆర్థిక నేరాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాక, లబ్ధి కోసం తనను తాను కిడ్నాప్ చేయించుకున్నారని కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీ, తన కుటుంబంతో సహా కిడ్నాప్ కావడం అనేది అప్పట్లో సంచలనం అయింది. ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును లైట్ గా తీసుకుంది.
ఇప్పుడు ఎంవీవీ సహా ఫ్యామిలీ కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టకుండా డబ్బుల కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చి పడేశారు. ఆ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయని, పునర్విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. సాధారణంగా ఎంపీ స్థాయి వ్యక్తి కుటుంబంతో సహా కిడ్నాప్ అయితే, అది పెద్ద సంచలనం అవుతుంది. అలాంటి కేసును పోలీసులు తీసిపడేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై ఫోకస్ చేసినట్లు తెలిసింది. పునర్ వచారణకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి ఆ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడై, అరెస్టు అయిన రౌడీషీటర్ హేమంత్‌తో గంటన్నరకు పైగా మాట్లాడినట్లు కూడా వార్తలు వచ్చాయి.
కిడ్నాప్ అయిన సమయంలో ఎంపీ ఎంవీవీతో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు (జీవీ) కూడా కిడ్నాప్ అయ్యారు. ఇప్పుడు జైలులో ఉన్న రౌడీషీటర్ హేమంత్‌తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. వారి సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారి జైలుకు వెళ్లి ఆరా తీశారు. హేమంత్ చెప్పిన ప్రకారం.. ఎంవీవీ, జీవీ అనేక సెటిల్‌మెంట్లు తనతో చేయించారని.. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బులను డబ్బు ఇవ్వలేదని అన్నారు. పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని చెప్పారు. ఆ కోపంతోనే కిడ్నాప్ చేశానని హేమంత్ విచారణలో చెప్పినట్లు తెలిసింది.
అదే నిజమైతే ఎంవీవీ, జీవీలకు ఉచ్చు బిగిసినట్లే అవుతుంది. హేమంత్ గ్యాంగ్‌తో సాగించిన భూదందాలు, లావాదేవీలు, ఆర్థిక నేరాలపై కూపీ లాగనున్నారు. హేమంత్, అతని స్నేహితులు కొందరు కలిసి గతేడాది జూన్‌లో ఎంవీవీ కుమారుడు శరత్‌ను ఆయన ఇంట్లోంచే కిడ్నాప్ చేశారు. తర్వాత శరత్ ద్వారా తల్లి జ్యోతిని, జీవీని అక్కడకు పిలిపించి బంధించారు. రెండు రోజులపాటు చిత్రహింసలు పెట్టారని వార్తలు వచ్చాయి. దీంతో వారు అప్పటికప్పుడు రూ. 1.70 కోట్ల సొమ్ము సమకూర్చారు. వాటిలో రూ.40 లక్షల నగదు హేమంత్ సన్నిహితురాలికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. జీవీ ఆమెకు ఫోన్ చేసి.. రియల్ ఎస్టేట్‌లో హేమంత్‌కు ఇవ్వాల్సిన కమీషన్ ఇది.. తీసుకోండి అని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా నాటి కిడ్నాప్ కేసును పునర్ విచారణ చేస్తే జరిగిన అక్రమాల గుట్టు వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు.