అడ్డుగోలు రాతలు రాస్తే ఎవరైనా శిక్షను అనుభవించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. వార్తలను వార్తలుగా కాకుండా.. వారి అభిప్రాయాలుగా ప్రచురించడంతోపాటు.. అనని మాటలను అన్నట్టుగా ప్రచురించడంతో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదయింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి అధ్వర్యంలో కొనసాగుతున్న సాక్షి పత్రికపై తిరుమలలో పోలీస్ కేసు నమోదయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ పోలీసులకి ఫిర్యాదు చేసింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వచ్చిన చంద్రబాబు ఈ నెల 5న.. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఉన్నతాధికారులు, పలు శాఖల అధికారులతో శ్రీపద్మావతి అతిథిగృహంలో సమీక్ష నిర్వహించారు.
దానికి డిప్యూటీ ఈవోగా నేను హాజరయ్యానని .. ఈ నెల 6వ తేదీ సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా.. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’ అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు.
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం తిరుమల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు లేనిపోనివి చెప్పారని సాక్షిలో వార్త వచ్చిందని, తాను చెప్పినట్లు మీరు వినాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు చెప్పలేదని, సాక్షి దినపత్రికలో తప్పుడు కథనం ప్రచురితమైందని, ఈ వార్త కారణంగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా పాక్షి యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపిస్తూ శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు చెప్పని విషయాలను చెప్పినట్లు సాక్షి దినపత్రికలో వచ్చిందని, శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి దిన పత్రికలో కథనం వచ్చిందని, వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో సాక్షి యాజమాన్యంపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సాక్షి దినపత్రిక యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.