32.2 C
Hyderabad
March 24, 2023 21: 01 PM
Slider తెలంగాణ

ఆర్టీసీ సమ్మె పిటీషన్ 15వ తేదీకి వాయిదా

HY13HIGHCOURT

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్ ను ఈ నెల 15 కు హైకోర్టు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్‌ రావు, ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. ఆర్టీసీ సమ్మెపై పిటిషన్ వేసిన పిటిషనర్ తరపు న్యాయవాది పివి కృష్ణయ్య తన వాదన వినిపిస్తూ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మె విరమింపజేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామని, అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం ఇద్దరి మధ్య ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు.

సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల తరపు న్యాయవాది, సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని కార్మికులు సమ్మె బాట పట్టారని కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు నెల రోజుల ముందే ప్రభుత్వాన్ని కోరారన్నారు. అంతేకాక గత నెల 3, 24, 26 తేదీల్లో ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారని వెల్లడించారు. కార్పొరేషన్‌ ఫండ్స్‌ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు, ఇతరత్రా వాటిని పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే.. కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని రచనా రెడ్డి కోర్టుకు వివరించారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్‌ రామచందర్‌ రావు తెలిపారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే.. కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు. బస్ పాస్ హోల్డర్స్ ను అనుమతి ఇస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్ల కు  ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Related posts

రాజ‌రాజ చోర‌తో మ‌రింత గుర్తింపు వ‌స్తుంది: న‌టి సునైన

Satyam NEWS

విశ్వ రహస్యాలను తెలిపే నాసా పవర్‌ఫుల్‌ టెలిస్కోప్‌

Sub Editor

పేరు చివరిలో ఆ రెండు అక్షరాలు ఉంటేనే పదవి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!