35.2 C
Hyderabad
April 20, 2024 18: 07 PM
Slider సంపాదకీయం

రాజ్యాంగ సంక్షోభం దిశగా కదులుతున్న కుల ఆంధ్రప్రదేశ్

#Justice

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖ అధికార రహస్యాల కిందికి వస్తుందా రాదా?  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు.

ఆ లేఖ సారాంశం ఏమిటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై ప్రభావం చూపించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తున్నారని.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అధినేత ఈ విధంగా ఆరోపణలతో లేఖ రాయడం బహుశ భారత దేశ చరిత్రలో ఇదే తొలి సారి కావచ్చు. అదీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన ఈ విధంగా లేఖ రాయడం, దాన్ని తన ప్రభుత్వ సలహాదారుడితో బహిరంగ పరచడం ఇప్పుడు న్యాయ నిపుణుల్లో చర్చ జరుగుతున్నది.

ఓత్ ఆఫ్ సీక్రెసీ కి వ్యతిరేకమా? కాదా?

ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దాన్ని బహిర్గత పరచడం ముఖ్యమంత్రిగా ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని చేసిన ప్రమాణానికి (ఓత్ ఆఫ్ సీక్రెసీ)కి విరుద్ధమనే వాదన వినిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకూ దాదాపు 80 వరకూ వ్యతిరేక తీర్పులు వచ్చాయి.

ఈ తీర్పులన్నీ ఒకరో ఇద్దరో న్యాయమూర్తులు ఇచ్చినవి కాదు. ఏపి హైకోర్టులోని న్యాయవాదులందరి వద్దకూ వివిధ అంశాలపై పిటీషన్లు విచారణకు వచ్చాయి. వాటిలోని న్యాయపరమైన అంశాలను పరిశీలించి వారు తీర్పులు చెప్పారు. ఇలా కొన్ని తీర్పులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది కూడా.

అక్కడ కూడా ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పులనే చాలా వరకూ సమర్థించారు. ఒకటి రెండు కేసుల్లో భిన్నమైన తీర్పులు వెలువడ్డా ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పులనే వారు సమర్థించారు. చాలా కేసులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే బెంచ్ కే వెళ్లాయి కూడా.

సుప్రీంకోర్టులో కూడా కేసులు వీగిపోయాయి కదా?

అక్కడ కూడా ఏపి హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కే నేరుగా ఫిర్యాదు లేఖ రాశారు. రాష్ట్ర హైకోర్టుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రాసిన లేఖ రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిణామం.

ఏపి హైకోర్టు పలు సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక మాజీ ఎమ్మెల్యేతో బాటు పలువురు సామాజిక మాధ్యమాలలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాలని ఆదేశించినా అడుగు ముందుకు పడకపోవడంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపైనా పోలీసు వ్యవస్థ పైనా హైకోర్టు వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుపడుతూ బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశారు.

కేసులు కేసులు కేసులు…..

చంద్రబాబునాయుడితో నేరుగా సంబంధాలు ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఎన్ వి రమణ ఈ విధంగా తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాహాటంగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి మరీ తెలిపారు.

మరో వైపు ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ముమ్మరం అయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల పరిష్కారాన్ని నేరుగా పరిశీలిస్తున్నది. ప్రజా ప్రతినిధులపై కేసుల అంశంలో ప్రధానంగా చర్చకు వచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్ ప్రో కో కేసులే.

అలాంటి కేసుల్లో నిందితుడైన వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్రంలో  జస్టిస్ ఎన్ వి రమణ కుమార్తెలపై అవినీతి నిరోధక శాఖ కేసులు పెట్టింది. ఈ కేసులపై ఏపి హైకోర్టు స్టే ఇచ్చింది. ఇలాంటి అన్ని అంశాలను వేరు వేరుగా చూడాలి. కానీ కుల రాజకీయాల ప్రాబల్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యం కాదు.

కమ్మ కులానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయి పోరాటం

కమ్మ కులానికి వ్యతిరేకంగా బాహాటంగా వ్యాఖ్యానిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులానికి అతీతంగా ప్రవర్తిస్తుందని ఎవరూ అనుకోరు. తమ ప్రధమ శత్రువుల అయిన చంద్రబాబునాయుడిని ఎదుర్కొనాలంటే ముందుగా ఆయనకు సహకరించే వారినందరిని సమూలంగా మట్టుపెడితే తప్ప సాధ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు చాలా సందర్భాలలో వెల్లడి అయింది.

ఆ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ పై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోరాటం చేసింది. ఇప్పుడు జస్టిస్ ఎన్ వి రమణపై పోరాటం మొదలు పెట్టింది. కమ్మ కులాన్ని బాహాటంగా వ్యతిరేకించే వారు, సపోర్టు చేసేవారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో మధ్యే మార్గంలో మాట్లాడేవారు లేరు.

ఒక వేళ ఎవరైనా లాజికల్ గా మాట్లాడదామన్నా వారిని ఈ రెండు వర్గాలలో ఒక వర్గంలోకి నెడతారు తప్ప లాజిక్ అర్ధం చేసుకోరు. కుల ఆంధ్రప్రదేశ్ లో ఎవరి బలం ఎంతో తేల్చుకునే పోరాటమే జరుగుతున్నది. ఈ కుల పోరాటంలో వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.

ఇప్పుడు న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నది. ఇప్పటి వరకూ జరిగిన పోరాటాలు వేరు. ఇప్పుడు మొదలైన పోరాటం వేరు. దీని పరిణామాలు ఇప్పుడే ఊహించడం సాధ్యం కాదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్    

Related posts

సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా

Satyam NEWS

విశాఖలో చంద్రబాబు పర్యటన కేసుల్లో 50 మంది అరెస్టు

Satyam NEWS

పువ్వాడ ని పరామర్శించిన కేటిఅర్

Bhavani

Leave a Comment