ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి దళిత కుటుంబం తరపున పీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నేతృత్వంలో పార్టీ నేతలు, మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, ప్రజలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఘనంగా సన్మానించారు.
అంతకుముందు మల్లయ్య నేతృత్వంలో గాంధీ భవన్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి, డప్పులు కొట్టి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడుతున్నామని, ఇన్నేండ్ల తర్వాత తమ పోరాటాలకు ప్రతిఫలం లభించిందన్నారు. వర్గీకరణతో, అణిచివేయబడ్డ కులాల్లో ఉన్న అసమానతలు పోయి, సమాన అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నామన్నారు. ఇదే ఆశతో మాదిగలు, మాదిగ ఉపకులాల వారు దశాబ్దాల పోరాటం కొనసాగించారని ఆయన తెలిపారు.

1980వ దశకంలో మొదలైన వర్గీకరణ పోరాటం, నేటికీ కొనసాగుతోందన్నారు. దశాబ్దాల వర్గీకరణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ అండగా నిలిచిందని మల్లయ్య అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా 2005లో అసెంబ్లీలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం తీర్మానం చేసిందని, 2006లో కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టీస్ ఉషామెహ్ర కమిషన్‌ను నియమించిందని ఆయన గుర్తు చేశారు. 2018లో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని తమ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ ప్రకటించారని, 2023 ఎన్నికలకు ముందు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని మల్లన్న గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని మల్లయ్య అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కేసులో బలంగా వాదనలు వినిపించేందుకు సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ లూత్రాను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా రెగ్యులర్‌గా ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును పరిశీలించడంతో పాటు, న్యాయ వాదుల బృందానికి అవసరమైన ఇన్‌పుట్స్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సూచనలు చేశారని మల్లయ్య వెల్లడించారు.
ఈ ఫలితంగానే సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంటలోనే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారన్నారు. గతేడాది ఆగస్ట్ మొదటి తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువడగా, కేవలం 6 నెలల వ్యవధిలోనే వర్గీకరణ చేయడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వానికి కొండేటి మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమ జాతికి చారిత్రాత్మక దినం అని, తమ భవిష్యత్ తరాలు ఈరోజు చిరకాలం గుర్తుంచుకుంటాయని మల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ పేర్లు చిరకాలం నిలిచిపోతాయన్నారు. వర్గీకరణ చేయాలని సూచించిన కేబినేట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్ కి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క కి మల్లయ్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి, చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి మల్లన్న విజ్ఞప్తి చేశారు.