24.7 C
Hyderabad
March 29, 2024 07: 07 AM
Slider సంపాదకీయం

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

#cbi

ఒక కేసు కీలకమైన దర్యాప్తు స్థాయిలో ఉన్నది…. ఇంకో కేసు లో అఫిడవిట్ దాఖలు చేయాలి…. ఈ రెండు కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన వాగ్మూలం నమోదు చేసిన సీబీఐ అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేయడంపై పలు అనుమానాలు తలెత్తతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

డిఐసి స్థాయి అధికారిని తప్పించి ఎస్ పి స్థాయి అధికారిని వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పరిశోధించేందుకు నియమించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.

ఇద్దరు కీలకమైన వ్యక్తులు రూ.8 కోట్ల మేరకు సుపారీ ఇచ్చారని ప్రత్యక్ష సాక్షి పేర్కొనడం, ఆ స్టేట్ మెంట్ ను జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట సీబీఐ నమోదు చేయించడం తెలిసిందే.

కీలకమైన ఆధారం లభించినందున ఇక ఆ ఇద్దరు పెద్దలను అరెస్టు చేయడమే తరువాయి అన్న స్థితిలో సంబంధిత సీబీఐ బృందం అధికారిని బదిలీ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య నిన్న మీడియాతో వెల్లడించారు.

సీబీఐ ఈ విధంగా ప్రవర్తించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఇద్దరు ప్రముఖులను తక్షణమే అరెస్టు చేసి కేసును తదుపరి స్థాయికి తీసుకువెళ్లాల్సిన సమయంలో సీబీఐ ఈ విధంగా ప్రవర్తించడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంలో కూడా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా మరో కీలకమైన కేసు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు. దేశంలో అత్యధిక కాలం బెయిల్ పై ఉన్న వ్యక్తిగా ఆయన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని సీబీఐ తొలుత కోర్టుకు తెలిపింది.

కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో కొంత కాలం కేసు వాయిదా పడ్డది. తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ కోరడంతో కేసు మరి కొంత సమయం పట్టింది.

ముందుగా న్యాయమూర్తి ఎదుట చెప్పిన మాటకు కట్టబడి ఉండకుండా సీబీఐ మాట మార్చడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

పోనీ కౌంటర్ దాఖలు చేస్తున్నారా అంటే అదీ లేదు. నేడు కేసు విచారణకు వచ్చిన సమయంలో మరింత గడువు కోరారు.

దాంతో కేసు ఈ నెల 30 కి వాయిదా పడింది. సీబీఐకి ఇద్దరు న్యాయవాదులు ఉండగా ఇద్దరికి ఒకే సారి ఆరోగ్య సమస్యలు తలెత్తడం పలు అనుమానాలకు తావిస్తున్నదని అంటున్నారు.

ఈ రెండు కీలకమైన కేసుల్లో సీబీఐ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు.

Related posts

వెరైటీ కామెడీతో అల్లరి సునామీ సృష్టించే చిత్రం సర్వం సిద్ధం

Satyam NEWS

వాలీబాల్ క్రీడాకారుడికి ములుగు జెడ్పి చైర్మన్ సాయం

Satyam NEWS

ఉక్రెయిన్ ముప్పు: ఇంకా వైదొలగని రష్యా భూతం

Satyam NEWS

Leave a Comment