దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచారం హత్య కేసులో దోషికి మరణశిక్ష విధించాలని కోరుతూ సిబిఐ శుక్రవారం కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ కేసులో నేర నిరూపణ అయిన సంజయ్ రాయ్‌కు దిగువ కోర్టులో తగిన శిక్ష పడలేదని సీబీఐ పేర్కొన్నది. అతనికి మరణశిక్ష విధించాలని కోరుతూ అప్పీలు దాఖలు చేసింది. జస్టిస్ దేబాంగ్సు బసక్ అధ్యక్షతన ఉన్న హైకోర్టు డివిజన్ బెంచ్, సిబిఐ అప్పీల్‌ను జనవరి 27న విచారిస్తామని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన అభ్యర్థనతో తన అప్పీల్‌ను అంగీకరించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ మాట్లాడుతూ, ఈ కేసును దర్యాప్తు చేసిన కేంద్ర ఏజెన్సీకి శిక్ష సరిపోలేదనే భావన ఉన్నదని ఈ కారణంతో హైకోర్టులో దిగువ కోర్టు ఉత్తర్వులను సవాలు చేసే హక్కు ఉందని అన్నారు. ఆగస్ట్ 9, 2024న డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య కేసులో సీల్దా కోర్టు రాయ్‌కి అతని సహజ జీవితం ముగిసే వరకు జీవిత ఖైదు విధిస్తూ జనవరి 20న తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణయం తీసుకునే ముందు సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషుల న్యాయవాదుల ద్వారా విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ బుధవారం తెలిపింది. ఈ కేసులో అప్పీల్ దాఖలు చేసే రాష్ట్ర హక్కును సీబీఐ వ్యతిరేకించింది. ఇది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ హక్కు అని పేర్కొంది.