ఉన్నావ్ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎమ్మెల్యే నే ప్రధాన నిందితుడని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ కోర్టుకి గురువారం సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి రిపోర్ట్ అందజేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమేనని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. బాధితురాలిపై 2017 జూన్ 4వ తేదీన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ కోర్టుకు విన్నవించింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని సీబీఐ అధికారులు తెలిపారు. బాధితురాలి తండ్రి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా కూడా పోలీసులు కేసు నమోదు చెయ్యలేదని వారు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. కొద్ది రోజుల క్రితం ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం, ఇతర సాక్షులకు రక్షణ కల్పించేందు కు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఢిల్లీ కోర్టు సిబిఐని ఆదేశించింది.ఈ క్రమంలో గురువారం సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు న్యాయస్థానానికి వివరించారు. ప్రస్తుతం ఉన్నావ్ అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెను సోమవారం రాత్రి ఇక్కడకు తీసుకువచ్చారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితురాలి తరపు న్యాయవాదిని కూడా మంగళవారం ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం కోమా పరిస్థిఇలో ఉన్న ఆయనకు కింగ్‌జార్జి మెడికల్ యూనివర్సిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
previous post