33.2 C
Hyderabad
April 26, 2024 02: 20 AM
Slider జాతీయం

బీజేపీ నాయకుడి భార్యను హత్య చేసిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు

#gurupreetsingh

తన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు కట్టు కథలు చెబుతున్నారని ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు గుర్తజ్ భుల్లర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తన ఇంట్లోకి జొరబడిన ఉత్తరప్రదేశ్ పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, తన భార్యపైకి నేరుగా కాల్పులు జరపడంతో ఆమె మరణించిందని భుల్లర్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇసుక మాఫియా నాయకుడు జాఫర్ ను వెతికేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉత్తరాఖండ్ లోని జస్పూర్‌లోని బీజేపీ నాయకుడు భుల్లర్ ఇంట్లోకి ఎలాంటి అరెస్టు వారంటు లేకుండానే ప్రవేశించారు.

ఆ సమయంలో మఫ్టీ డ్రస్ లో ఉన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు తాగి ఉన్నారని కూడా భుల్లర్ అంటున్నారు. మద్యం మత్తులో ఉన్న పోలీసులు మొదటి అంతస్తులో ఉన్న తన భార్య గదిలోకి ప్రవేశించారని, అప్పుడు అక్కడ తన భార్యతో బాటు తన మరదలు, ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారని భుల్లర్ చెప్పారు. తాను నోయిడాలోని బీజేపీ సమావేశానికి వెళ్లి అలసిపోయిన కారణంగా కింది అంతస్తులోనే నిద్ర పోతున్నారని చెప్పారు.

అరుపులు కేకలు విని నిద్రలేచి తాను వెళ్ళేలోగా తాగి ఉన్న పోలీసులు తన భార్యను హత్య చేశారని భుల్లర్ తెలిపారు. తాను తన బంధువులు కలిసి తక్షణమే తన భార్యను ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదని భుల్లర్ వాపోయారు. తన భార్య గుర్జిత్ కౌర్ (34) ఒక ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన అన్నారు. జాఫర్ అనే ఇసుక స్మగ్లర్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.

జాఫర్ బావమరిది తన పార్టీ లో పని చేసేవారని, తమ బావ అయిన జాఫర్ ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు వేధిస్తున్నారని, మైనింగ్ స్మగ్లర్ గా చిత్రీకరిస్తున్నారని ఎలాగైనా కాపాడాలని కోరాడని, అయితే తాను పూర్తి వివరాలు తెలుసుకుని చెబుతానని అన్నట్లు భుల్లర్ తెలిపారు. ఈ లోపునే సివిల్ డ్రెస్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు తాగి వచ్చి తన ఇంటిపై దాడి చేసి తన భార్యను హత్య చేశారని ఆయన ఆరోపించారు.

జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులో కాదో కూడా తెలియని ఆ గుర్తు తెలియని వ్యక్తులు నలుగురిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారని భుల్లర్ తెలిపారు. అయితే ఉత్తరాఖండ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులతో కుమ్మక్కై దొరికిన వారిని వదిలేశారని ఆయన అన్నారు. జస్పూర్‌లో గుర్జిత్‌ కౌర్‌ను హతమార్చిన పోలీసు సిబ్బందిని అరెస్టు చేయాలని ఆల్‌ ఇండియా సిక్కు రిప్రజెంటేటివ్‌ బోర్డు యూపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర సింగ్‌ ఫలోదియా డిమాండ్‌ చేశారు.

నిందితులను అరెస్టు చేసే వరకు మృతుల చితాభస్మాన్ని నిమజ్జనం చేయబోమన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులు కూడా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సిక్కు రిప్రజెంటేటివ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు ఫలోదియా ఇతర సిక్కు నేతలతో కలిసి శుక్రవారం భరత్‌పూర్‌లోని భుల్లార్ ఫామ్‌కు చేరుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గుర్జిత్ కౌర్ హంతకులని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేయకపోగా, యూపీ పోలీసులు మాత్రం సీన్ మార్చి భుల్లర్ కుటుంబంపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పోలీసులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము నమ్మకమైన సమాచారం మేరకే జాఫర్ ను అరెస్టు చేసేందుకు వెళ్లామని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు. జాఫర్ ఉన్న ఇంటిపై దాడి చేశామని అయితే ఎదురు కాల్పులు జరపడంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చందని పోలీసులు అంటున్నారు. కాల్పుల్లో గుర్జిత్ కౌర్ మరణించారని పోలీసులు తెలిపారు. తాము తనిఖీలకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. ఉత్తరాఖండ్ లో ఈ అంశంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకుడికే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

Related posts

నూతన చట్టంతో తాకట్టులోకి దేశ వ్యవసాయ రంగం

Satyam NEWS

పీకే టీమ్ స్ట్రాటజీ: ఆంధ్రాలో అన్నకు… తెలంగాణలో చెల్లికి

Satyam NEWS

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది

Satyam NEWS

Leave a Comment