33.4 C
Hyderabad
March 9, 2021 15: 22 PM
Slider ప్రపంచం

Analysis: తుంటరి ట్రంప్ పోగాలపు పనులు

#DonaldTrump

మరో వారం రోజుల్లో పదవి నుంచి వైదొలగబోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఊహాతీతంగా  ప్రవర్తిస్తున్నారు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్ టన్ డీసీ లో ఎమర్జెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచారు. ఈ తరహా నిర్ణయం అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ జరుగలేదు.

మరొక వారం రోజుల్లో జో బైడెన్ కొత్త అధ్యక్షుడుగా సింహాసనాన్ని అధిరోహించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు జరుగుతాయంటూ ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించడం కూడా విచిత్రమైన చర్యగానే విశ్లేషకులు భావిస్తున్నారు.

జో బైడెన్ గెలుపును ధ్రువీకరించకుండా అడ్డుకోడానికి ట్రంప్ మద్దతుదారులు మొన్న క్యాపిటల్ భవనంపై విశృంఖలంగా ప్రవర్తించారు. దారుణంగా  దాడి చేశారు.  ఈ దుశ్చర్యకు ప్రేరకుడు, కారకుడు ట్రంప్ అని అందరికీ తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడిని తీవ్రంగా భావించిన డెమోక్రాట్లు  ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా మేధావులు

ఈనెల 20వ తేదీలోపే ట్రంప్ ను అధ్యక్ష పీఠం నుంచి దింపడానికి డెమోక్రాటిక్ పార్టీ గట్టిగా  ప్రయత్నం చేస్తోంది. ఈ అభిశంసనకు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా కొందరు మద్దతు తెలుపడం గమనార్హం. అమెరికాలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలన్నీ గత చరిత్రకు భిన్నంగా, దేశానికి పెద్ద మచ్చను మిగిల్చే విధంగా సాగడం ఎంతో బాధాకరమని అమెరికన్ పౌరులు ఆవేదన చెందుతున్నారు.

క్యాపిటల్ భవనంపై దాడి ఈ పరిణామాల్లో పరాకాష్ట. అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధికారంలో ఉన్న అధ్యక్షుడి సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించడం కూడా  అవమానకర పరిణామం. ప్రజల తీర్పును గౌరవించకుండా, ఓటమిని అంగీకరించకుండా, లాంఛనంగా పద్ధతి ప్రకారం పదవి నుంచి దిగిపోకుండా, బలవంతంగా దింపే పరిస్థితులు తెచ్చుకోవడం, అదీ! కేవలం కొన్ని రోజుల వ్యవధికి ముందే కావడం అమెరికా ప్రతిష్ఠను దిగజార్చే ఉదంతాలుగానే చరిత్రలో మిగిలిపోతాయి.

వికృత చేష్టలతో… అవమాన భారం దిశగా…

వీటన్నింటికీ మూలం, సర్వం డోనాల్డ్ ట్రంప్ టెంపరితనం. ఆయన  వికృత చేష్టలు, మితిమీరిన అహంకారం, అవధులులేని అధికార కాంక్ష ఆయన కొంపే ముంచాయి, వ్యక్తిగతంగా ఆయనకు, అధ్యక్ష హోదాకు, అమెరికాకు చెడ్డపేరును పెద్దఎత్తున మూటగట్టాయి.

ప్రస్తుతం డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన నెగ్గితే, ట్రంప్ తలదించుకొని, మెడలు వంచుకొని  పదవి నుంచి దిగిపోవాల్సిందే. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు ముట్టడించడానికి డోనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహించారంటూ, దిగువ సభలో డెమోక్రాటిక్ పార్టీ సభా నాయకుడు డేవిడ్ సిసిలీన్ అభిశంసన తీర్మానాన్ని రాశారు.

దీనికి 185 మంది  మద్దతు తెలిపారు. దీనిపై బుధవారం నాడు ఓటింగ్ నిర్వహించనున్నారు. దీని తర్వాత సెనెట్ కు పంపిస్తారు.అయితే, జో బైడెన్ కాబినెట్ ను ఆమోదించడం వంటి ప్రక్రియల వల్ల అభిశంసన తీర్మానాన్ని స్వీకరించడంలో సెనెట్ జాప్యం చేసే అవకాశాలు ఉన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.

ఒకవేళ, తీర్మానంపై చర్చను ప్రారంభిస్తే, మిగిలిన కార్యక్రమాలను  చేపట్టే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్నది పరిశీలించాల్సి వస్తుంది.అటువంటి సందర్భం ఎదురైతే, బైడెన్ కేబినెట్ కు ఆమోద ముద్ర పడే ప్రక్రియ ఆలస్యం కావచ్చు.

క్యాపిటల్ భవనంపై దాడి అంశంలో డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్ సభ్యుల మద్దతుగా ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ట్రంప్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాడు.ఈ కారణం వల్ల అభిశంసన నెగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభిశంసన విజయవంతమైతే ట్రంప్ పదవి నుంచి దిగిపోవాల్సిందే.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావచ్చు

Satyam NEWS

త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

Satyam NEWS

పాకిస్తాన్ లో దుమారం రేపుతున్న మతమార్పిడి

Satyam NEWS

Leave a Comment