34.2 C
Hyderabad
April 23, 2024 12: 12 PM
Slider ముఖ్యంశాలు

కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి

#Yanamala Ramakrishnudu

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇది: ‘‘ఒక రాజధాని (A new Capital) ప్రాంత’’ గుర్తింపునకు నిపుణుల కమిటిని కేంద్రప్రభుత్వం నియమించాలని సెక్షన్ 6లో పేర్కొన్నారు.

‘‘ఒక రాజధాని’’ గుర్తింపు ప్రక్రియలో భాగంగా, కేంద్రం రూపొందించిన చట్టం ప్రకారం, హైకోర్టు, ఏపి చట్టసభల ఆమోదంతో అమరావతిని కొత్త రాజధానిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి వచ్చే ప్రభుత్వాలకు, రాష్ట్రపతి ఆమోదం లేకుండా దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు.

‘‘కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని’’ సెక్షన్ 94(3), సెక్షన్ 94(4)లో పేర్కొన్నారు. హైకోర్టు, సెక్రటేరియట్, చట్టసభల భవనాలు, ఇతర మౌలిక వసతులను గత ప్రభుత్వం అభివృద్ది చేసింది కేంద్ర చట్టం సెక్షన్ 94 సబ్ సెక్షన్ 4లో పేర్కొన్నట్లుగానే..

ఇటీవల మరో ముఖ్య ఉదాహరణ పిపిఏలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అంశంలో, వాటిపై రాష్ట్రం ముందుకు పోవద్దని కేంద్రం సూచించింది. కాబట్టి ఇలాంటి అత్యవసరమైన రాజ్యాంగ ఉల్లంఘనల వంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాలను కాపాడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 2బిల్లుల అంశం కూడా, ఫెడరలిజం(సమాఖ్య రాజ్యం) కిందకు రాదు, ఆ ముసుగులో ఏపి ప్రభుత్వం దాక్కోలేదు..

అందుకే దీనిని ‘‘ఫ్యూడలిస్ట్ నడుపుతోన్న ఫెడరల్ స్టేట్..’’అంటున్నాం. ఇలాంటి అంశాలపై కేంద్రం ద్వారా పూర్తి నిర్ణయాధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఉంది. ఇందులో ఫెడరలిజమ్ అనే సమస్య ఉత్పన్నం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్మణ రేఖను రాష్ట్రప్రభుత్వం అతిక్రమిస్తే, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను వాడడంలో కేంద్రాన్ని ఏదీ నిరోధించలేదు.

తమ అధికార పరిధిని ఎవరూ(ఏ యూనిట్) అతిక్రమించ రాదని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోంది..భారతదేశంలో చట్టాలు 3 విధాలు, కేంద్ర పరిధి, రాష్ట్ర పరిధి, ఉమ్మడి పరిధి.. ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రానిదే ఆధిప్యతం. అవశేష అధికారాలన్నీ కేంద్రానికే దఖలు పరిచారు.

భారత రాజ్యాంగం సమాఖ్య రాజ్యం కాదు, ఏకకేంద్ర రాజ్యమని ప్రొ కె పి ముఖర్జీ వాదన గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, ఈ 2బిల్లుల అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని చక్కదిద్దేందుకు కేంద్రానికి ఇదే తగిన సమయంగా నా అభిప్రాయం.

యనమల రామకృష్ణుడు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

Related posts

పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్

Satyam NEWS

అంగన్ వాడీ కేంద్రంలో ఒక చిన్నారిపై ఆయా క్రౌర్యం

Satyam NEWS

సంక్రాంతి సందళ్లు

Satyam NEWS

Leave a Comment